20-08-2025 07:36:42 PM
జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): వర్షాలు తీవ్రంగా కురుస్తున్న నేపథ్యంలో గ్రామాలలో పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మండలంలోని నర్సరీలలో మొక్కల పెంపకం, పారిశుద్ధ్య నిర్వహణ తీరు, గ్రామాల వారీగా ఓటర్ల జాబితా తయారీపై పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని అన్నారు. గ్రామాల్లో ఎక్కడ కూడా నీరు నిలువ ఉండకుండా చూడాలని కోరారు. దోమల నివారణపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలన్నారు. సాయంత్రం వేళల్లో ఫాగింగ్ చేయించాలని సూచించారు. గ్రామాలలో ఓటర్ల ముసాయిదా జాబితాను నాలుగు రోజుల్లో సిద్ధం చేయాలని పంచాయతీ అధికారులను డిపిఓ ఆదేశించారు.
ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉందని, ఎప్పుడు నిర్వహించినా అందుకు అధికారుల సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో 36 గ్రామపంచాయతీలు, 26 80 వార్డులు ఉండగా 3.76 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. గ్రామాలలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా మండల పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. నర్సరీలలో మొక్కల పెంపకం, సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని కోరారు.