20-09-2025 12:00:00 AM
గ్రామకార్యదర్శిపై గ్రామస్తుల ఫిర్యాదు.. కాంట్రాక్టర్‌పై ఆగ్రహం
నంగునూరు, సెప్టెంబర్ 19 : నంగునూరు మం డలం గట్లమల్యాలలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనుల్లో జాప్యంపై విజయక్రాంతి ‘ప్రారంభా నికి ఎదురుచూపులే‘, విధి లైట్లు లేవని ‘బతుకమ్మకైనా వెలుగొచ్చేనా‘ అనే శీర్షికలు వరుసగా ప్రచురించింది. స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ శుక్రవారం గట్లమల్యాల గ్రామంలో పర్యటించారు. ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించారు.
నిర్మాణ పురోగతిపై ఆరాతీశారు. ప్రధాన భవనం పూర్తయినా కూడా ప్రహరీ గోడ, సీసీ రోడ్డు, నీటి సరఫరా, ఫర్నిచర్ వంటి కనీస సౌకర్యాలు ఇంకా పూర్తి కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా పెండింగ్ పనులన్నీ ప్రారంభించాలని, లేదంటే కాంట్రాక్టర్ టెండర్ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో ఆమెతో పాటు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రేవతి, స్థానిక వైద్యాధికారి అంజలి రెడ్డి కూడా ఉన్నారు.
గ్రామాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు..
గ్రామ పంచాయతీ కార్యదర్శి జి. లలిత అవినీతి, అక్రమాలపై గ్రామస్తులు జిల్లా జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు ఫిర్యాదులు చేశారు. విజయక్రాంతి కథనాన్ని గుర్తు చేస్తూ పంచాయతీ కార్యదర్శి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ గ్రామ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరో పించారు.
ఇళ్లు నిర్మాణాలకు అనుమతుల కోసం అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, గ్రామంలో పారిశుధ్యాన్ని పట్టించుకోవడం, సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు అదనపు కలెక్టర్కు వివరించారు. త్వరలోనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.