17-09-2025 02:07:48 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): కౌమారం.. బాలికల్లో అత్యంత కీలకమని, ఇది జీవితాన్ని మలుపుతిప్పే దశ అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఈ దశ సంక్లిష్టమైనదన్నారు. ప్రజాభవన్‌లో కౌమా ర బాలికల సాధికారతపై మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్ర మంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు.
సామాజిక రుగ్మతలకు చెక్ పెట్టేలా గ్రామాల వారీగా కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళా స్వయం సహాయక బృందాలతో అనుసంధానం చేయాలని సూచించారు. కౌమార బాలికలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటారని, బాల్య వివాహాలు, చదువును ఆపే యడం, రక్తహీనత, పోషకాహారలోపం, ఆరో గ్య సంబంధిత సమస్యలు, వేధింపులకు గురయ్యే ప్రమాదముంటుందని ఆందోళనవ్యక్తం చేశారు.
ఈ సమస్యలు కౌమార బాలిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. అందుకే మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలోనే కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సంఘాల ఏర్పాటులో డీఆర్‌డీఓలు, డీడబ్ల్యూఓలు కలిసి పని చేయాలన్నారు.
కిషోర బాలిక సంఘాలను బలోపేతం చేస్తే.. వారి సమస్యలన్నీ సమసి పోతాయని తెలిపారు.. సమావేశంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, అడిషనల్ సీఈఓ కాత్యాయని, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ జి.సృజన, యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్, కౌమార యువజన అభివృద్ధి అధికారి ఎం. మురళీకృష్ణ, తరుణి సంస్థ చైర్ పర్సన్ మమత రఘువీర్ పాల్గొన్నారు.