02-09-2025 12:00:00 AM
అరకొర సరఫరాతో రైతన్నల బేజారు..
తాండూరు, సెప్టెంబర్‌౧ (విజయక్రాంతి) ః యూరియా కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. పొలం పనులు మానుకొని యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడిన రైతులకు నిరాశ మిగులుతుంది. సోమవారం ఉదయం నుండి పెద్దముల్ రైతు సేవా సహకార సంఘం కార్యాలయం వద్ద టోకెన్ల కోసం క్యూ కట్టారు. యూరియా దొరుకుతుందో లేదో అని మహిళా రైతులు సైతం అధికారులు ఇచ్చే టోకెన్ల కోసం బారులు తీరారు.
భూమి ఒక ఎకరం నుండి నాలుగు, 5 ఎకరాలు ఉన్న కేవలం ఒకే ఒక యూరియా సంచి మాత్రమే అందుతుందని అది ఏ మూలకు సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . జనగాం గ్రామానికి చెందిన మల్లప్ప అనే రైతు క్యూ లైన్ లోనే సోమ్మ సిల్లి పడిపోవడంతో తోటి రైతులు ఆసుపత్రికి తరలించారు. భారీగా రైతులు రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నియంత్రించారు. గత సంవత్సరం 6000 పై చిలుకు యూరియా సంచులు రాగా ఈసారి నాలుగువేల యూరియా బ్యాగులు వచ్చాయని మరింత యూరియా రానుందని కార్యాలయం సిబ్బంది తెలిపారు.