25-09-2025 10:12:33 PM
చేగుంట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని పలు ఎరువుల, విత్తనాల దుకాణాలలో స్టాక్ రిజిస్టర్, ఈ పాస్ మిషన్ లను మండల వ్యవసాయ శాఖ అధికారి హరి ప్రసాద్ తనిఖీ చేశారు. అనంతరం హరి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమం లో భాగంగా రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. యాంత్రీకరణలో భాగంగా బ్యాటరీ స్ప్రేయర్స్, కల్టివేటర్స్, పవర్ టిల్లర్స్, రోటో వేటర్, పవర్ వీడర్, స్ట్రా బ్యాలెర్, సీడ్ కమ్ ఫెర్టీ డ్రిల్ మొత్తం మీద 49 పనిముట్లను అందిస్తామని తెలిపారు.
పనిముట్లను ప్రభుత్వ సబ్సిడీ పై ఇస్తున్న నేపథ్యంలో అవసరం ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు కోసం పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్ తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలని, ట్రాక్టర్ పరికరాలు అవసరం ఉన్న రైతులు దరఖాస్తు పత్రాల తో పాటు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జిరాక్స్ ప్రతులను జత చేసి రైతు వేదికలోని వ్యవసాయ కార్యాలయంలో ఈ నెల 29 లోగా అందజేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్న సన్నకారు మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ లభిస్తుందని అన్నారు. ఇది వరకు లబ్ది పొంది ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు కాదని, వివరాలకు మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ సూచించారు.