calender_icon.png 26 September, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

tgewidc site engineer in acb net at jangaon

25-09-2025 11:08:25 PM

ఏసిబి వలలో అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్


అక్రమ లావాదేవీలపై ఏసీబీ బుల్డోజర్


ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ అధికారులు దూకుడు


హనుమకొండ,(విజయక్రాంతి): జనగామ జిల్లా డీఈఓ ఆఫీస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ అక్రమ పద్ధతిలో లంచం డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొడకండ్ల మండలంలోని ఒక పాఠశాలలో భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన నిధుల విడుదలకు సంబంధించిన ఫైలును ముందుకు కదిలించడానికి 18 వేల రూపాయల లంచం కోరినట్టు సమాచారం. రమేష్ డిమాండ్‌తో విసిగిపోయిన పాఠశాల నిర్వాహకులు నేరుగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ను వేసి పథకం ప్రకారం ముందుకు సాగారు.

హనుమకొండలోని ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయంలో రమేష్ రూ.8వేలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రమేష్ అరెస్టుతో అధికార వర్గాల్లో కలకలం రేగింది. నిష్కళంకంగా ఉండాల్సిన విద్యా విభాగంలోనే ఇటువంటి అవినీతి బహిర్గతం కావడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తోంది.

పిల్లల భవిష్యత్తు కోసం మంజూరైన నిధులకే ముళ్లుపెట్టి లంచం కోరడం సిగ్గుచేటు అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనతో జనగమ జిల్లా విద్యా శాఖలో మరిన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రమేష్‌పై ఏసీబీ అధికారులు చట్టపరమైన చర్యలు చేపడుతుండగా, ఇతర అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరపనున్నట్టు సమాచారం.