25-09-2025 10:09:37 PM
తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్
నార్సింగి/చేగుంట(విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణ, నేర రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు తమ వంతు సహకారం అందించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు. గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సందర్భంగా కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా,నార్సింగి పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. పరిశీలనలో భాగంగా స్టేషన్ సిబ్బంది పని తీరు, రికార్డులను, కేసుల దర్యాప్తు తీరును పర్యవేక్షణ చేశానని, పని తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ఫ్రెండ్లీ, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, అందరితో కలుపుగోలుగా ఉంటూ ప్రజలలో నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. ఫిర్యాదు దారుడు మధ్యవర్తి లేకుండా నేరుగా స్టేషన్ కు వచ్చేలా ధైర్యం కలిగించాలని అన్నారు. సీసీ కెమెరాల తో నేరాలను అరికట్టగలమని, ఒక్క కెమెరా వంద పోలీసులతో సమానమని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా గ్రామ పెద్దలతో సంప్రదించాలని అన్నారు. సైబర్ నేరాలు, మత్తు పదార్థాలను అరికట్టాలని, మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే అనర్థాలపై, సైబర్ మోసాలపై ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా లేవని, జాతీయ రహదారి ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాల కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అన్నారు.
రహదారి పై పోలీసులు క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించి, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. గణేష్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నట్లుగానే దసరా ఉత్సవాల సందర్భంగా జరిగే దేవి నవరాత్రులు కూడా ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించుకుందామని పిలుపు నిచ్చారు. మండల ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలను తెలిపారు. స్థానిక ఎస్ఐ బీమరి సృజన, ఏఎస్ఐ మిస్బాఉద్దీన్, రవీందర్, హెడ్ కానిస్టేబుళ్ళు మురళి, రత్నం, మల్లేశం, రఫీకుద్దీన్ సిబ్బంది పర్యవేక్షణ సందర్భంగా స్టేషన్ లో ఉన్నారు.