calender_icon.png 8 May, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

07-05-2025 01:42:26 PM

కార్మిక సంఘాల తీర్మానం

మహబూబాబాద్,(విజయక్రాంతి): కార్మికులకు శాపంగా మారిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలనే డిమాండ్ తో ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల నాయకులు ఐక్యంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, బడా పెట్టుబడి కార్పోరేట్లకు రెడ్ కార్పేట్ పరుస్తూ దేశ సంపదను దోచిపెడుతోందని ఆరోపించారు.

దశాబ్ద కాలంగా కార్మికులు ఐక్య పోరాటాల చేసి సాధించుకున్న 29 లేబర్ కోడులను రద్దుచేసి వాటి స్థానంలో కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికులను బజారున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పరి శేఖర్, చాగంటి కిషన్, శివారపు శ్రీధర్, జల్లే జయరాజు, మంద భాస్కర్, మిట్ట గడుపుల వెంకన్న, వడ్డెబోయిన లక్ష్మీ నరసయ్య, బండి రాజు, దారావత్ బిచ్చు తదితరులు పాల్గొన్నారు.