08-08-2025 01:07:49 PM
గద్వాల, (విజయక్రాంతి): నులిపురుగుల నిర్మూలన కోసం 1 నుండి 19 సంవత్సరంలోపు వారందరికీ ఈ నెల 11 న ఆల్బెండజోల్ మాత్రలు(Albendazole tablets) తప్పకుండా వేయించాలని జిల్లా అదనపు కలెక్టర్ నరసింగరావు అన్నారు. శుక్రవారము కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ... 1 నుండి 19 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికీ నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలను వైద్య ఆరోగ్యశాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలను ఆదేశించారు.
పిల్లలలో నులిపురుగులు ఉండటం వలన వారిలో పోషకాహార లోపం, రక్తహీనత,ఆకలి మందగించడం తదితర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని, వీటివల్ల చదువుపై ఏకాగ్రత కోల్పోతారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారి సిద్ధప్ప, జిల్లా పంచాయతీ అధికారి నాగేంద్రం, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయ రాజు, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఎస్సి కార్పొరేషన్ ఈడీ నిషిత, ఐటిఐ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసూన రాణి, డా. రాజు, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.