08-08-2025 01:10:23 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని గొర్రెలు, మేకలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రాజనగరం సమీపంలో శుక్రవారం గొర్రెలు మేకల కోసం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీకాల క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా గొర్రెలు మేకలకు టీకాలు వేయడాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గొర్రెలు, మేకలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని ఆదేశించారు.
ప్రస్తుతం నీలి నాలుక వ్యాధి సోకకుండా అన్ని గొర్రెలు మేకలకు బ్లూ టంగ్ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. గొర్రెలకు టీకాలు ఇచ్చే ముందు రోజు సంబంధిత రైతుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఎన్ని టీకాలు పంపిణీ చేయడం జరిగిందని పశు సంవర్ధక శాఖ అధికారిని ప్రశ్నించగా, 3.39 లక్షలు టీకాలు రావడం జరిగిందని బదులిచ్చారు. అక్కడే ఉన్న రైతులు మాట్లాడుతూ గొర్రెలు మేకలకు నటల నివారణ మందులు పంపిణీ చేయాలని కలెక్టర్ ను కోరగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ సంవర్ధక అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, పశుసంవర్ధక వైద్యులు, ఇతర అధికారులు, స్థానికులు కురుమూర్తి, గోపాల్, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.