08-08-2025 04:22:56 PM
మాల గురిజాల బాధితుల డిమాండ్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం(Bellampalle Mandal)లోని మాల గురిజాల గ్రామంలో పట్టేదారును మోసం చేసి 3 గుంటల భూమికి బదులు 13 గుంటల భూమిని గ్రామానికి చెందిన కామెర నారాయణ అక్రమంగా పట్టా చేయించుకున్నారని గ్రామానికి చెందిన భూమి బాధితులు ఏ గోలపు గణేష్, ఏ గోలపు రేణుక, కలాలి యశోద, దుర్గం అంకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 162 సర్వే నంబర్లో గోమాస పోషం 1998లో మూడు గంటల భూమి కామెర నారాయణకు అమ్మినట్లు వారు తెలిపారు. ఈ భూమిని ఆనుకొని ఉన్న 10 గుంటల వరకు అక్రమంగా పట్టా చేసుకొని దౌర్జన్యానికి దిగుతున్నాడని బాధితులు వాపోయారు.
రెవెన్యూ అధికారులు తమ భూమిని గుర్తించి కామెర నారాయణ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి పట్టాను రద్దు చేయాలని వారు వేడుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్న నేతకాని మహా జిల్లా అధ్యక్షులు గోమాస శ్రీకాంత్ పై స్థానికులైన నేతకాని సంఘం నాయకులు బురద జల్లుతున్నారని నేతకాని మహర్ జిల్లా అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు అన్నారు. బాధితుల పక్షాన కాకుండా స్వార్థపరుల పక్షాన కొమ్ముకాస్తున్న నేతకాని నాయకులకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ గోలపు రమేష్, రమాదేవి, కలాలి రామయ్య, గోమాస తిరుపతి, డోంగ్రి లక్ష్మణ్, డోంగ్రి గోపాల్, గోమాస అశోక్, దుగుట విలాస్, గోమాస ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.