16-10-2025 06:57:15 PM
అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం..
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): బుగులోని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.గురువారం ఐడిఓసి కార్యాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ బుగులోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం జాతర, బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పోలీస్, సింగరేణి, వైద్య, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో నవంబర్ 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరకు వేలాదిమంది భక్తులు తరలివస్తారని, అందువల్ల అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భక్తుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా తాత్కాలిక మరమ్మతులు,రహదారి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. భక్తులు గుట్టపైకి ఎక్కడానికి అనువుగా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.పరకాల, భూపాలపల్లి ఇతర డిపోల నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యవసర వైద్య కేంద్రాలు, 108 అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. భక్తులకు సురక్షిత త్రాగునీరు అందించేందుకు ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.జాతర సమయంలో భక్తుల రద్దీ నియంత్రణకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉంచాలని, అలాగే అటవీ శాఖ తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జాతర నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.శాఖల వారిగా చేపట్టాల్సిన పనులపై అంచనా నివేదికలు ఇవ్వాలని సూచించారు. సిసి కెమెరాల ద్వారా బందోబస్తు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో కలిసి బుగులోని జాతర ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే, అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సింగరేణి జీఎం రాజేశ్వర రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, ఆర్టీసీ డిఎం ఇందు, డివిజనల్ పంచాయతి అధికారి మల్లికార్జున్ రెడ్డి,జాతర చైర్మన్ గంగుల రమణా రెడ్డి, దేవస్థానం ఈఓ బిల్ల శ్రీనివాస్,తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్,జాతర మాజీ చైర్మన్ లు రొంటాల వెంకటస్వామి, కట్ల మధుసూదన్ రెడ్డి,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.