calender_icon.png 29 September, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగారం మండలంపైనే అందరి దృష్టి..!

28-09-2025 10:57:21 PM

నాగారం: సూర్యాపేట జిల్లా పరిషత్ పీఠం రిజర్వేషన్‌లలో భాగంగా బీసీ జనరల్‌కు మారడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు ఊహించని స్థాయికి మారాయి. ఇప్పటికే ఈ పీఠంపై కూర్చోవడానికి నియోజకవర్గం నుండి ప్రముఖ నేతలు ఆశపడ్డారు. అయితే ఆయా మండలాల్లో రిజర్వేషన్ల ప్రకారం ఆశావాదులకు అనుకూలంగా జడ్పిటిసి స్థానం కలిసి రాలేదు. చివరికి అనుకూలమైన ఇతర మండలాలపై దృష్టి సారించారు. నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం జనరల్ మహిళ, మద్దిరాల ఎస్సీ జనరల్, నూతనకల్ ఎస్సీ మహిళ, నాగారం బీసీ జనరల్, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాలు ఎస్టీ జనరల్‌కు కేటాయించబడ్డాయి. అయితే జడ్పీ పీఠాన్ని ఆశించే నాయకుల్లో మహిళలైతే బీసీ మహిళ, అన్ని వర్గాల వారైతే బీసీ జనరల్ నుండి పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఇలాంటివి పలు మండలాలు ఉన్నాయి.

అయితే పక్క మండలాల నుండి పోటీ చేయాలంటే కొంత కష్టమే. ఈ లెక్కన సొంత నియోజకవర్గంలోని కలిసి వచ్చే మండలం నుండి జడ్పిటిసిగా పోటీచేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ లెక్కన తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చేసరికి బీసీ జనరల్‌గా ఉన్న నాగారం, జనరల్ మహిళగా ఉన్న జాజిరెడ్డిగూడెం మండలాల నుండి మాత్రమే ఆశావాదులు పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే మొదటి నుండి ఈ పీఠంపై కూర్చోవాలని తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా 2019 నుండి నేటి వరకు కూడా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

అయితే ఆయన ఉన్నతమైన పదవి ఆశిస్తూ వచ్చారు. ఈలోగా గత ఏడాది రైతు కమిషన్ సభ్యునిగా అవకాశం రావడంతో దాన్ని తిరస్కరించారు. చివరికి పలువురి అగ్ర నేతల బుజ్జగింపులతో ఆ పదవిని చేపట్టారు. ఇప్పటికి కూడా ఆయన ఆ పదవిలో అయిష్టతతోనే కొనసాగుతూ మరో ఉన్నతమైన పదవి కోసం వెతుకులాడుతున్నారు. ఈలోగా జడ్పీ చైర్మన్ పీఠం తనకు కలిసి వచ్చే విధంగా ఉందని భావించి రంగంలో దూకారు. కాగా డిసిసి అధ్యక్షునిగా ఆయన సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో గుర్తింపు పొందినప్పటికీ చివరికి తన సొంత మండలమైన మద్దిరాల నుండి రిజర్వేషన్ అనుకూలంగా వస్తే పోటీ చేయాలని భావిస్తూ వచ్చారు. కానీ మద్దిరాల ఎస్సీ జనరల్ కోటాలోకి వెళ్ళింది. దీంతో చెవిటి వెంకన్న నియోజకవర్గంలోని మిగతా మండలాల దృష్టి సారించారు. తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలు కూడా రిజర్వేషన్ల పరంగా ఆయనకు కలిసి రాలేదు.

ఇక మిగిలిన మరో మండలమైన నాగారం బీసీ జనరల్‌గా మారి చెవిటి వెంకన్నకు ఆశా దీపంగా నిలిచింది. దీంతో అక్కడి నేతలను ఒప్పించుకొని పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు నాగారం మండలం నుండి జెడ్పిటిసిగా గెలిచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో జడ్పీ పీఠాన్ని సొంతం చేసుకునే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు కూడా పోటీలో ఉన్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఆమె కొనసాగుతున్నప్పటికీ తనకు తగ్గ రీతిలో పదవులు రాలేదంటూ కొంత నిరుత్సాహంగానే ఉన్నారు. అయితే చెవిటి వెంకన్న, అనురాధలు పార్టీ పరంగా ఒకే తాటిపై నడుస్తున్నారు. ఈ లెక్కన చెవిటి వెంకన్న రంగంలో ఉంటే అనురాధ పోటీకి కొంత వెనకంజ వేయచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడంతో పాటు విజయాల పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయనే ధీమాతో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు వస్తున్నప్పటికీ ఫైనల్‌గా నాగారం మండలానికి చెందిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి పైనే ఆధారపడి ఉంటుంది.

నేను పోటీలో ఉంటున్న: చెవిటి వెంకన్న

జెడ్పి చైర్మన్ పదవికి తాను పోటీలో ఉంటున్నానని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.తనకు అనుకూలమైన నాగారం మండలం నుండి జడ్పిటిసి గా పోటీ చేస్తానని తెలిపారు.