calender_icon.png 29 September, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 45 లక్షలతో ఉడాయించిన భూ మాయగాళ్లు

28-09-2025 11:23:55 PM

మంచిర్యాల జిల్లా బట్వాన్ పల్లిలో వెలుగుచూసిన ఘటన..

భూమాయ గాళ్ళ ఇంటి ఎదుటే బాధితుల వంటావార్పు, రాత్రి నిద్ర.. 

బెల్లంపల్లి (విజయక్రాంతి): నకిలీ అగ్రిమెంట్ భూమి పత్రాలను చూపించి నిరుపేదలైన అమాయకుల వద్ద రూ. 45 లక్షలు దండుకొని భూ మాయగాళ్ళు ఊడాయించిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన రామ్ టెంకి హరికృష్ణ, రామ్ టెంకి శివ, పాత మంచిర్యాలకు చెందిన బొలిశెట్టి భీమయ్య, భీమిని రాంపూర్ కు చెందిన మొండి, చిన్న బూదకు చెందిన లగిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తులు పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో గల దుబ్బపల్లి కి చెందిన బాలాని గంగరాజు, పూజారి సమ్మయ్య, పూజారి నాగేష్, దాసరి శ్యామ్, గోపి, పోల రాములు అనే వడ్డెర కులస్తుల నుండి రూ.45 లక్షలను తాండూర్ మండలంలోని అచ్చులాపూర్ శివారులో గల సర్వే నంబర్ 340/1, 341/బి లలో 12 ఎకరాలు నకిలీ అగ్రిమెంట్ పత్రాలను చూపి దండుకున్నారు.

డబ్బులను చెల్లించి రెండు నెలలు గడుస్తున్న భూమి అమ్మకానికి పెట్టిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ కు రాకపోవడంతో అనుమానం వచ్చి బాధితులు ఆరా తీయగా భూ మాయగాళ్ళ వలలో పడి మోసపోయినట్లు గుర్తించారు. దీంతో ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించిన వారు అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తమ కుటుంబాలతో బట్వాన్ పల్లి గ్రామానికి వచ్చి తమను మోసం చేసిన రామ్ టెంకి హరికృష్ణ, రామ్ టెంకి శివల ఇళ్ళ ముందు ఆందోళనకు దిగారు. వందమందికి పైగా గ్రామస్తులు మహిళలు, చంటి పిల్లలతో అక్కడే వంటలు చేసుకుని రాత్రి రోడ్డుపై అక్కడే నిద్రించారు. తమకు మధ్యవర్తిగా వ్యవహరించి డబ్బులు దండుకున్న పాత మంచిర్యాలకు చెందిన బొలిశెట్టి భీమయ్య అనే వ్యక్తిని తమ అదుపులో ఉంచుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ గ్రామంలోనే ఉంటామని చెబుతున్నారు.