28-09-2025 11:06:31 PM
గోలెం వెంకటేశం..
బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం, సిర్పూర్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ పండుగకు అవసరమైన ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోలెం వెంకటేశం విమర్శించారు. సద్దుల బతుకమ్మ రోజున తెలంగాణ సోదరీమణులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కూర్చోబెడతారని, అనంతరం నిమజ్జనం కోసం సరైన వేదికలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలో కుంటలు, చెరువులు అందుబాటులో లేకపోవడంతో పాటు, సిర్పూర్ పేపర్ మిల్ క్రీడా మైదానం లేదా ఎస్పీఎం గ్రౌండ్ వద్ద తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ అటు అధికారులు ఇటు ఎస్ పి ఎం యాజమాన్యం ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. “మన తెలంగాణ సాంప్రదాయాల పట్ల, మన బతుకమ్మ పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చూపుతోందో ఈ ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది. తెలంగాణ తల్లి చేతిలో ఉండాల్సిన బతుకమ్మను పట్టించుకోకుండా, సోదరీమణులు ఆడుకునే ఈ పండుగను అవమానపరచడం ఖండనీయమని” గోలెం వెంకటేశం అన్నారు.