05-01-2026 12:25:34 AM
ఆకాశవాణి న్యూస్ రీడర్ల ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు
ముషీరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): దేశ విదేశీ భాషల్లో వార్తా ప్రసారా లు, సంగీత, సాహిత్య, విద్యా, వైజ్ఞానిక కార్యక్రమాలు అందించడంలో ఆకాశవాణి సేవలు అనితర సాధ్యమని పలువురు వక్తలు అన్నారు. తురగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగిన తరతరాల ఆకాశవాణి న్యూస్ రీడర్ల ఆత్మీయ సమ్మేళనం అపూర్వమైన రీతిలో జరిగింది. గత 60 ఏళ్ల కాలంలో ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ కేంద్రాల నుంచి తెలుగులో జాతీయ, ప్రాంతీయ వార్తలు చదివిన ఆరు తరాల న్యూస్ రీడర్లు, అనువాదకులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఆకాశవాణి విశ్రాంత ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ నూకల వేణుధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ఆకాశవాణి బ్రిటిష్ కాలం నుంచి వార్తలు, ఇతర కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నదని, ముఖ్యంగా వందకు మించిన దేశ విదేశీ భాషల్లో వార్తలందించడంతో పాటు సంగీతానికి అందించిన, అందిస్తున్న సేవలు నిరుపమానమైనవని తెలిపారు.
సభకు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి, సీనియర్ క్యాజువల్ న్యూస్ రీడర్ డాక్టర్ జె. చెన్నయ్య అధ్యక్షత వహించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం ప్రసంగిస్తూ కొంగర జగ్గయ్య, అద్దంకి మన్నార్, కందుకూరి సూర్యనారాయణ, దుగ్గిరాల పూర్ణయ్య, జోలిపాలెం మంగమ్మ, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి వంటి మహా న్యూస్ రీడర్లు ఆకాశవాణిలో వార్తలు చదివిన కాలం స్వర్ణయుగమని అన్నారు.
ప్రముఖ న్యూస్ రీడర్ల విద్వత్తును గురించి రాసిన వార్తా ప్రస్థానం గ్రంథాన్ని వేణుధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆకాశవాణి లో నాటి, నేటి న్యూస్ రీడర్లు, వార్తల అనువాదకులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. గ్రంథ రచయిత, సీనియర్ న్యూస్ రీడర్ గద్దె దుర్గారావు దంపతులకు ఘనంగా సత్కారం జరిగింది. దుర్గారావు, తురగా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, న్యూస్ రీడర్ తురగా ఉషారమణి ప్రసంగించారు. న్యూస్ రీడర్ రచయిత రాయారావు సూర్యప్రకాశరావు గ్రంథ పరిచయం చేశారు. న్యూస్ రీడర్లు శరత్ జోత్స్న, అక్క రాజు నిర్మల్ తదితరులు పాల్గొన్నారు.