అన్ని రంగాలు కార్పొరేట్ గుప్పిట్లో
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
మిర్యాలగూడలో సీపీఎం మహాసభలు
నల్లగొండ, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కార్పొరేట్ శక్తులు అన్నిరంగాలను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజా సంపదను దోచుకుంటున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపు మైదానంలో సోమవారం పార్టీ జిల్లా మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగి ప్రజల జీవన ప్రమాణం తగ్గుతుంటే ప్రధాని మాత్రం కార్పొరేట్లకు మద్దతుగా నిలుస్తూ వారిని కుబేరులుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఆగ్రిస్పాట్ పేరుతో రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని విమర్శించారు.
అనంతరం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధి పేరిట అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు ఆ తరువాత వారిని పట్టించుకోకుండా అన్యాయం చేస్తున్నాయన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షత ఈ కార్యక్రమం జరిగింది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, లక్ష్మీనారాయణ, కున్‌రెడ్డి నాగిరెడ్డి, బండా శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.






