26 April, 2026 | 11:33 AM

లేబర్ సెస్ పంపకం

03-12-2024 01:49 AM
  1. అదనంగా పొందిన ఎక్సైజ్ టాక్స్ 81 కోట్లు వాపస్‌కు ఏపీ అంగీకారం
  2. విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల భేటీ
  3. ఎటూతేలని విద్యుత్ పంచాయితీ! 
  4. మరోసారి సమావేశం కావాలని నిర్ణయం

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ పునర్విభజన అంశాలపై చర్చించేందుకు సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకాలపై సీఎస్‌ల కమిటీ చర్చించింది. విద్యుత్ బకాయిలు, ఉద్యోగులు పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకంపై అధికారులు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది.

పలు అంశాలపై నిర్ణయం

ఈ భేటీలో రూ. 861 కోట్ల లేబర్ సెస్‌ను ఏపీ, తెలంగాణ మధ్య విభజనకు నిర్ణయించారు. ఏపీకి అదనంగా చెల్లించిన ఎక్సుజ్ టాక్స్ రూ.81 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్ ట్రాఫికింగ్ నిరోధం కోసం ఇరు రాష్ట్రాల పోలీసు, ఎక్సుజ్ శాఖలతో జాయింట్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రెండు, మూడు అంశాల్లో ఇరు రాష్ర్ట ప్రభుత్వాల మధ్య ఒప్పందానికి నిర్ణయం తీసుకున్నారు.

అలాగే ఉద్యోగుల మార్పిడిపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.  ఎక్సైజ్ శాఖకు తెలంగాణ చెల్లించిన రూ.81 కోట్ల బకాయిల అంశం పరిష్కారమైంది. అదనంగా ఇచ్చిన ఆమొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు ఏపీ తెలిపింది. మరో రెండు అంశాల పైనా ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. దీనిపై రెండు రాష్ట్రాలు ఒప్పందానికి రావాలని నిర్ణయం తీసుకున్నారు.

మరోమారు విభజన అంశాలపై సమావేశం కావాలని ఏపీ తెలంగాణ సీఎస్‌లు నిర్ణయించారు.పరిష్కారం కానీ విద్యుత్ బకాయిల పంచాయతీ విద్యుత్ బకాయిల అంశంతోపాటు, 9,10 షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాల విషయంలోనూ పంచాయితీ తేలలేదని సమాచారం. విద్యుత్ బకాయిల అంశంలో  రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముందు నుంచి ఉంది.

2014 జూన్ నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ తీసుకున్న విద్యుత్‌కు రూ.3,441 కోట్లు రావాలని ఏపీ అంటోంది. సకాలంలో చెల్లించనందుకు ఆలస్య రుసుం కింద మరో రూ.3,315 కోట్లు.. మొత్తం రూ.6,756 కోట్లు చెల్లించాలని ఏపీ చెబుతోంది.

అయితే ఏపీ నుంచే తమకు రూ. 17,828 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది. ఏపీకి చెల్లించాల్సినవి రూ.4,887 కోట్లు తీసేసి మిగతా రూ.12,940 కోట్లు తమకే ఏపీ ఇవ్వాలని తెలంగాణ చెబుతోంది. ఈ అంశాలు సీఎస్‌ల భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఏపీలో తొలిసారిగా అధికారుల భేటీ

విభజన అంశాలపై చర్చించేందుకు తొలిసారిగా ఏపీలో అధికారులు భేటీ అయ్యారు. ఈ ఏడాది జూలై 5న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు. ఆ భేటీకి కొనసాగింపుగానే ఇరు రాష్ట్రాలకు చెందిన సీఎస్‌లు భేటీ అయ్యారు.

మావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, వాణిజ్యపన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితోపాటు, ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.