10-09-2025 12:00:00 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 9 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో యూరియా సంక్షోభం నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ అన్ని శాఖల అధికారులను భాగస్వాములను చేశారు.
రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, పంచాయతీరాజ్, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖ, సహకార శాఖ అధికారులతో పాటు ఇతర శాఖల జిల్లా అధికారులను 18 మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. ప్రతిరోజు మండల ప్రత్యేక అధికారి నేతృత్వంలో ఆయా శాఖల మండల స్థాయి అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ,
యూరియా పంపిణీ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు యూరియా పంపిణీ కార్యక్రమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తున్నారు. దీనితో జిల్లాలో యూరియా పంపిణీ వ్యవహారం ఒక గాడిలో పడింది.