10-09-2025 12:21:41 AM
అన్నింటికీ సంచార వాహనాలే..
అందుబాటులో లేని వైద్యులు
వేధిస్తోన్న ఖాళీల కొరత
నల్లగొండ, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఘంటపథంగా చెబుతోంది. కానీ ఏండ్ల నాటి నుంచి వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉంటూ రైతాంగానికి ఆదరువుగా నిలుస్తోన్న పశువైద్య వ్యవస్థ వ్యవస్థను మాత్రం గాలికొదిలేసింది. ప్రాంతీయ ఆస్పత్రికి ఒక వైద్యుడు ఉండాల్సి ఉన్నా.. ఆ మేరకు సిబ్బంది ఎక్కడ కానరావడం లేదు.
రైతులు తమ కుటుంబ సభ్యుల్లా భావించే మూగజీవాలకు ఏదైనా జబ్బు చేస్తే.. ప్రైవేటుకు పరుగులు తీయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సంచార పశువైద్యశాల వాహనాలను అందుబాటులోకి తెచ్చా మని చెబుతున్నా.. దాంతో పెద్దగా ప్రయోజనం లేకుండాపోతోంది. సంచార పశువైద్య శాలల మెయింటెన్స్ అధ్వాన్నంగా మారడంతో మూగజీవాల వెతలు తీర్చేనాథుడు కన్పించడం లేదు.
ప్రభుత్వ పశువైద్య సిబ్బందికి ప్రత్యామ్నాయంగా గోపాల మిత్రలను చూపుతూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో గోపాల మిత్రలు వైద్యానికి భారీగా వసూలు చేస్తుండడం.. సరైన వైద్యం అందించలేకపోతుం డడం వల్ల మూగజీవాలు మృత్యువాతపడుతుండడం గమనార్హం.
నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థితి..
నల్లగొండ జిల్లాలో ఐదు ప్రాంతీయ పశువైద్యశాలలు ఉండగా, 56 పీహెచ్సీలు, 59 ఉపపీహెచ్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 11 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 47 పారా సిబ్బంది, 80 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే జిల్లాలో 2,01, 252 ఆవులు, 3,17,247 గేదేలు, 9,12,625 గొర్రెలు, 3,36,182 మేకలు ఉన్నాయి. వీటికి సేవలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇకపోతే..
సూర్యాపేట జిల్లాలో ఐదు ప్రాంతీయ పశువైద్యశాలలు, 42పీహెచ్సీలు, 41 ఉపపీహెచ్సీ(సబ్ సెంటర్లు) ఉన్నాయి. వీటికితోడు 80 మంది గోపాలమిత్రలు పశువైద్యం కోసం అందుబాటులో ఉన్నారు. అయితే జిల్లాలో 1,77,985 ఆవుజాతి పశువులు, 3,19,192 గేదెలు, 5,61,529 గొర్రెలు, 1,18,093 మేకలు ఉండగా, వీటికి వైద్యం అందించేందుకు మాత్రం ఖాళీలు వెక్కిరిస్తున్నాయి.
జిల్లాలో 41 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 35 మంది ఉండగా, 29 మంది లైవ్ స్టాక్ అసిస్టెంట్ పోస్టులకు 12 మంది, 26 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు 24 మంది, 85 మంది ఆఫీసు సబార్డినేట్లకు కేవలం 26 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఖాళీల కొరత వల్ల జిల్లాలో పశువులకు సరైన వైద్యం అందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
యాదాద్రిభువనగిరి జిల్లాలో తెల్లజాతి పశువులు 69,173, నల్లజాతి పశువులు 1,22,620, గొర్రెలు 6,92,445, మేకలు 1,49,954, కోళ్లు 45,08,382 ఉన్నాయి. అయితే వీటికి వైద్యం అందించేందుకు జిల్లాలో ప్రాంతీయ వైద్యశాలలు 3, పీహెచ్సీలు 31, సబ్ సెంట ర్లు 40 ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 167 పోస్టులకు గాను 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో వైద్యుల ఖాళీల కొరత కొంత తక్కువగా ఉన్నప్పటికీ.. అధిక శాతం మంది వైద్యులు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో సకాలంలో పశువులకు వైద్యం అందడం లేదు.
వర్షాకాలంలో సీజనల్ ముప్పు..
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మూగజీవాలకు వైద్యం అందని దయనీయ పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ పశువైద్య కేంద్రాల్లో చాలాచోట్ల జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు లేకపోవడంతో పశువులకు సరైన వైద్యం అందడం లేదు. గ్రామా ల్లో పశువైద్య కేంద్రాలు ఉన్నప్పటికీ సిబ్బం ది, మందులు కొరత కారణంగా నిరుపయోగంగా ఉంటున్నాయి.
దీనికి తోడు జిల్లాలో గొర్రెల యూనిట్ల పంపిణీకి గొర్రెల కొనుగోలుకు పశువైద్యులు ఇతర జిల్లాల్లో పర్యటి స్తుండడంతో.. మూగజీవాలకు వైద్యం అందడంలేదు. ఉన్న కాస్త సిబ్బంది విధులకు డుమ్మాలు కొడుతున్నా పట్టించుకునే నాథు డే కరువయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్యం అందించాల్సిన డాక్లర్లు, సిబ్బంది జిల్లా కేంద్రంలో నివాసముంటూ తమ ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
మందులకు బయటకే..
పశుసంవర్ధకశాఖలో మందుల సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో పశువులకు రోగమొస్తే వైద్యం చేసిన డాక్టర్లు చీటీ రాసి రైతుల చేతుల్లో పెడుతున్నారు. మందులు తెస్తేనే వైద్యం అందిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు పరుగున ప్రయి వేటు మందుల షాపులకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల రైతులకు అదనపు భారం పడుతోంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మందులు, ఇతర శస్త్రచికిత్సలకు సంబంధించిన సామగ్రి ఉంచాల్సి ఉన్నా ఆ దిశగా పట్టించుకోవడం లేదని, దీంతో సకాలంలో వైద్యం అందక పశువులు మృతి చెందుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పుడప్పుడు గ్రామంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ మందులు కూడా సరిగ్గా అందడంలేదనే ఆరోపణలు లేకపోలేదు.
జిల్లాలో పశు సంపద పెరిగినా అందుకు తగిన స్థాయిలో వైద్యులు అందుబాటులోకి రాలేదు. ఫలితంగా సకాలంలో వైద్యసేవలు అందక మూగజీవాల మనుగడ దైవాదీనంగా మారింది. రైతులు, పశు పోషకులు సొంతవైద్యం, నాటు పద్ధతులను ఆశ్రయిస్తూ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.