calender_icon.png 10 September, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు

10-09-2025 01:22:10 AM

-పునఃమూల్యాంకనం ఆధారంగా ఫలితాలివ్వండి 

-8 నెలలలోపే ప్రక్రియను పూర్తి చేయాలి సాధ్యంకాని పక్షంలో మళ్లీ పరీక్ష నిర్వహించండి 

-సింగిల్ జడ్జి బెంచ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ!

-అదేబాటలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు

హైదరాబాద్, సెప్టెంబర్ 9: టీజీపీఎస్సీ గ్రూప్ మెయిన్స్ పేపర్లను పునఃమూల్యాంకనం చేయాలని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతంలో టీజీపీఎస్సీ ఇచ్చిన మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసింది. పునఃమూల్యాంక నం ఆధారంగా మళ్లీ ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. సాధ్యంకాని పక్షంలో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. దీంతో ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు చుక్కెదురైనట్టయింది.

మెయిన్స్ పేపర్ల మూల్యాం కనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్నందున పరీక్షలు రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు సైతం వేరుగా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జూలై 7న వాదనలు విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా మంగళవారం తీర్పును వెలువరిచింది.

‘సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునఃమూల్యాంకనం చేయాలి. అవకతవకలకు తావు లేకుండా పునఃమూల్యాంకన ప్రక్రి య చేపట్టాలి. ఆ తర్వాతే 563 మందిని ఎం పిక చేసి పోస్టింగులు ఇవ్వాలి. మరోసారి అవకతవకలు జరిగితే మళ్లీ పరీక్షలకు ఆదేశిస్తాం’ అని జస్టిస్ నామవరపు రాజేశ్వర రా వు తీర్పు వెల్లడించారు.

ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లోపే పూర్తి చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో మె యిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 2024, అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్ మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడా ది మార్చి 10 ఫలితాలు వెలువడ్డాయి.

కాగా ఈ ఫలితాలపై అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక సందేహాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మం ది ఉద్యోగానికి ఎంపికవ్వడం.. తెలుగు మీడి యం అభ్యర్థులు అత్యల్పంగా ఎంపిక కావ డం.. కేవలం రెండు సెంటర్ల నుంచే టాపర్లు ఉండటంపై అభ్యర్థులు ఉన్న త న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే క్రమంలో ఎం పికై విద్యార్థులు పరీక్షలు రద్దు చేయొద్దం టూ పిటిషన్ దాఖలు చేశారు.

ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న ఉన్నత న్యా యస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఇప్పటికే గ్రూప్ పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈలోపు.. పునఃమూర్యాలంకనానికి ఆదేశిస్తూ టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. రీవాల్యూయేషన్ జరిపాకే వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని, ఒకవేళ సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.

డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ

గ్రూప్ మెయిన్స్ పేపర్లను పునఃమూల్యాకంనం చేయాలంటూ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇచ్చిన తీర్పును సవాలు చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి, పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఎంపికైన అభ్యర్థుల్లో తీర్పు నైరశ్యం నింపిందని తెలుస్తోంది. దీంతో వారు కూడా డివిజన్ బెంచ్‌కు వెళ్తారని తెలుస్తోంది.

హైకోర్టు జడ్జిమెంట్ కాపీ అందిన అనంతరం డివిజన్ బెంచ్‌కి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తామని టీజీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. 2024, ఫిబ్రవరి 19వ తేదీన 563 పోస్టులకు టీజీపీఎస్సీ తరఫున నోటిఫికేషన్ వెలువడింది. మే/జూన్‌లో ప్రిలిమ్స్, అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో మెయిన్స్ ఫలితాలు, ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయ్యింది. పోస్టుంగుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుతో అభ్యర్థులకు చుక్కెదురైంది.