calender_icon.png 26 December, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌పీవోను భగ్నం చేసేందుకే ఆ ఆరోపణలు

25-06-2024 12:27:18 AM

  •  హిండెన్‌బర్గ్‌పై గౌతమ్ అదానీ ధ్వజం

దిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్  హిండున్‌బర్గ్ గత ఏడాది అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలు కుట్రపూరితమైనవని ఛైర్మన్ గౌతమ్ అదానీ పునరుద్ఘాటించారు. తమ మలిదశ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ)ను భగ్నం చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు. అదానీ గ్రూప్ 32వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

హిండెన్‌బర్గ్ ఆరోపణల వెనక రాజకీయ శక్తులు కూడా ఉన్నాయని అదానీ ఆరోపించారు. వీటిని మీడియాలోని ఒక వర్గం మరింత ఎక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించిందన్నారు. తద్వారా తమ గ్రూప్  ప్రతిష్ఠను దిగజార్చి కంపెనీల మార్కెట్ విలువను కుంగదీయాలని చూశారన్నారు. తమ కంపెనీలను అప్రతిష్ఠ పాల్జేసి ఆర్థికంగా హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే అలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తద్వారా తమ గ్రూపుపై మార్కెట్ వర్గాల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూశారని ఆరోపిం చారు.

హిండెన్‌బర్గ్ నిరాధార ఆరోపణలన్నింటినీ తాము సమర్థంగా ఎదుర్కొన్నా మని అదానీ తెలిపారు. రూ.17,500 కోట్ల రుణ వాయిదాలను ముందస్తుగా చెల్లించి మదుపరులు, రుణదాతల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలిగామని పేర్కొన్నారు. ఎఫ్‌సిఓ విషయంలోనూ తమ కంపెనీ నైతిక విలువలకు కట్టుబడి వ్యవహరించిందని తెలిపారు. రూ.20 వేల కోట్లు సమీకరించినప్పటికీ.. వాటన్నింటినీ తిరిగి ఇచ్చేశామని గుర్తుచేశారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు, విలువలతో కూడిన వ్యాపారంపై తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

తమ స్థానంలో ఇంకే కంపెనీ ఉన్నా.. తిరిగి కోలుకోవడం సాధ్యం అయ్యేది కాదని అదానీ  అభిప్రాయపడ్డారు. తమ వద్ద ఉన్న అధిక ద్రవ్య లభ్యతే తమను కాపాడిందని తెలిపారు. నగదు నిల్వలను మరింత పెంచుకోవడం కోసం రూ.40వేల కోట్లు అదనంగా సమీకరించినట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్  తమ నమోదిత కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలు పొందిందని ఆరోపించింది. అకౌంటింగ్ మోసాలకు పాల్పడినట్లు పేర్కొంది. పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే కరీబియన్, మారిషస్‌లనుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని తెలిపింది. వీటిద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది.