calender_icon.png 26 December, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్యాపింగ్‌పై సిట్ స్పీడ్

26-12-2025 02:38:18 AM

  1. ఫోన్ ట్యాపింగ్ కేసులో అనూహ్య మలుపు.. తెరపైకి నందకుమార్
  2. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ట్యాపింగ్ పుణ్యమేనని సిట్ నిర్ధారణ
  3. నా ఫోన్ ట్యాప్ చేశారంటూ నందకుమార్ వాంగ్మూలం.. సాక్ష్యాలు సమర్పణ
  4. రెండు   విడిపోయి.. సిట్ పక్కా స్కెచ్
  5. ముగిసిన ప్రభాకర్‌రావు కస్టడీ.. నేడు కోర్టుకు
  6. మావోయిస్టుల ముప్పుపైనే హరీశ్‌తో మాట్లాడా: ప్రభాకర్‌రావు

హైదరాబాద్, సిటీబ్యూరో డిసెంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇన్నాళ్లు పోలీసు అధికారుల అరె స్టులు, విచారణల చుట్టూ తిరిగిన ఈ కేసు.. ఇప్పుడు నేరుగా గత ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల మెడకు చుట్టుకునే దిశగా సాగుతోంది. ఈ కేసులో మాస్టర్‌మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎస్‌ఐ బీ చీఫ్ ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచార ణ గురువారంతో ముగియగా, చివరిరోజు చోటుచేసుకున్న పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిందితుడైన డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ అనూహ్యంగా సిట్ విచారణకు హాజరుకావడం, ఆయన ఇచ్చిన సమాచారం ఇప్పుడు దర్యాప్తు బృందానికి కీలకఅస్త్రంగా మారినట్లు తెలుస్తోంది.

సీన్‌లోకి నందకుమార్.. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలో అరెస్ట్ అయిన నందకుమార్ గురువారం సిట్ ఎదుట హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకు రావడానికి, అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగే ప్రధాన కారణమని సిట్ అనుమానిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా నందకుమార్ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ‘నేను ట్యాపింగ్ బాధితుడిని.. కేసీఆర్ ప్రభుత్వం నా ఫోన్‌ను చట్టవిరుద్ధం గా ట్యాప్ చేసింది. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, ఎమ్మెల్యేల ఎపిసోడ్‌ను సృష్టించింది.

నాఫోన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ట్యాప్ చేశారనే దానికి సంబంధించిన పక్కా ఆధారాలు నా వద్ద ఉన్నాయి’ అని నందకుమార్ సిట్ అధికారులకు వివరించినట్లు తెలిసింది. ఈ విషయమై తాను గతంలోనే అప్పటి డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, అయి నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రలో భాగస్వాములైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నంద కుమార్ స్టేట్‌మెంట్‌తో ట్యాపింగ్, ఎమ్మెల్యే ల కొనుగోలు కేసుల మధ్య ఉన్న అవినాభావ సంబంధం బయటపడినట్లయింది.

రెండు బృందాలుగా విడిపోయి.. 

విచారణ చివరి రోజు కావడంతో సమయం వృథా కాకూడదని సిట్ చీఫ్ సీపీ సజ్జనార్ వ్యూహాత్మకంగా వ్య వహరించారు. సిట్ అధికారులను రెండు బృందాలుగా విభజించి దర్యాప్తును వేగవంతం చేశారు.

టీమ్1 టెక్నికల్ క్రాస్ ఎగ్జామినేషన్: ఈ బృందం ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగ రావు, రాధాకిషన్ రావులను ఒకే గదిలో కూర్చోబెట్టి ముఖాముఖి విచారణ  జరిపింది. ఒకరు చెప్పిన సమాధానాన్ని మరొకరితో సరిపోల్చుతూ, పరస్పర విరుద్ధ ప్రకటనలపై నిలదీసింది.

టీమ్2 డాక్యుమెంటేషన్ ఫైనాన్షియల్: రెండవ బృందం ప్రధానంగా ప్రభాకర్ రా వు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడం, స్వా ధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌ల డేటాను విశ్లేషించడం, నిందితుల ఆర్థిక లా వాదేవీల పై దృష్టి సారించింది.

అసెంబ్లీ తర్వాత.. 

ఈ కేసు దర్యాప్తునకు లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలంటే.. ట్యాపింగ్ ద్వారా లబ్ధిపొందిన రాజకీయ పెద్దలను విచారించక తప్పదని సిట్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులను విచా రించేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున, అవి ముగియగానే వీరికి నోటీసులు జారీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభాకర్ రావు విచారణలో వెల్లడించిన అంశాలు, నందకుమార్ ఫిర్యాదు ఆధారంగా వీరిని ప్రశ్నించనున్నారు. అవసరమైతే చార్జిషీట్‌లో వీరి పేర్లను చేర్చడంతో పాటు, అరెస్టులు చేసే అవకాశం కూడా లేకపోలేదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అందుకే మాట్లాడా..

డిసెంబర్ 12న లొంగిపోయిన ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 25 వరకు సిట్ కస్టడీలోకి తీసుకుంది. చివరి రోజు సిట్ చీఫ్, సీపీ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని బృందం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. మాజీ మంత్రి హరీశ్‌రావుతో ఎందుకు తరచూ మాట్లాడేవారని ప్రశ్నించగా.. ప్రభాకర్ రావు తెలివిగా సమాధానం ఇచ్చారు. హరీశ్‌రావుకు మావోయి స్టుల నుంచి తీవ్రమైన ప్రాణహాని ఉంది. ఆయన భద్రతను పర్యవేక్షించే క్రమంలోనే, ముప్పును అంచనా వేయడానికే ఫోన్లో మా ట్లాడేవాడిని తప్ప.. రాజకీయ ప్రత్యర్థుల ఫో న్లు ట్యాప్ చేయడానికి కాదు అని చెప్పినట్లు సమాచారం. మిగతా ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించారు. తాను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేదని, మాజీ డీజీపీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌లు నవీన్ చంద్, అనిల్ కుమార్‌ల ఆదేశాల మేరకే పనిచేశానని నెపాన్ని వారిపైకి నెట్టేశారు.

జూబ్లీహిల్స్‌లో హైడ్రామా

బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. విచారణ ముగుస్తుండటంతో.. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఇప్పటికే అరెస్టయిన ఇతర నిందితులు ప్రణీత్ రావు, భుజంగ రావు, రాధాకి షన్ రావు, తిరుపతన్న, శ్రవణ్ రావులను అక్కడికి పిలిపించారు. అందరినీ ఒకే గదిలో ప్రభాకర్ రావు ముందు కూర్చోబెట్టారు. ఒకరు చెప్పిన సమాధానాన్ని మరొకరితో సరిపోల్చుతూ సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు మెజారిటీ ప్రశ్నలకు నో తెలియదు అనే సమాధానమే ఇవ్వగా, పెన్‌డ్రైవ్ వ్యవహారంపై మాత్రం మౌనం వహించారు.

ప్రభాకర్ రావును ఏ ప్రశ్న అడిగినా.. మాజీ డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు నవీన్ చంద్, అనిల్ కుమార్ పేర్లను మాత్రమే ప్రస్తావిస్తున్నట్లు సమచారం.. ఇక ఫోన్ ట్యాపింగ్ చేసి న 6 వేల ఫోన్ నంబర్లు ఉన్న పెన్‌డ్రైవ్‌పై ప్రభాకర్‌రావు నోరు మెదపనట్లుగా తెలుస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యా పింగ్ చేశారు, రాజకీయ నేతల పాత్రపై ఆరా తీయగా ప్రభాకర్ రావు మాజీ మంత్రి హరీశ్‌రావు పేరును ప్రస్తావించినట్లుగా సమా చారం.

కస్టోడియల్ విచారణ చివరి రోజు కావడంతో సిట్ అధికారులు డాక్యుమెంటేషన్ పనుల్లో నిమగ్నమయ్యారు. కస్టడీ గడువు ముగియడంతో ప్రభాకర్‌రావును వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం కో ర్టులో హాజరుపరచనున్నారు. రాబోయే రో జుల్లో ఈ కేసు ఇంకెన్ని సంచలనాలకు వేదిక అవుతుందో అని రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

కుమారుడి ఖాతాలపై సిట్ కన్ను..

విచారణలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్‌రావు కుమారుడు నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై సిట్ దృష్టి సారించింది. ట్యాపింగ్ ద్వారా బెదిరించి వసూలు చేసిన డబ్బులు ఏమైనా నిశాంత్ ఖాతాల్లోకి మళ్ళాయా.. విదేశాల్లో పెట్టుబడులు పెట్టారా.. అనే కోణంలో అధికారులు ఆరా తీశారు. ప్రభాకర్ రావును ఈ విషయంపై గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.