26-12-2025 02:21:45 AM
నాగోబా జాతరలో వెక్కిరిస్తున్న సమస్యలు
అసంపూర్తిగా శాశ్వత పనులు
ఉట్నూర్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదివాసీల ఉత్సవం నాగోబా జాతర ఏటా సమస్యల నడుమే కొనసాగుతున్నది. అక్కడ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయం ఉన్నది. ఏటా పుష్యమాసంలో జరిగే నాగో బా జాతరకు వందలాది మంది భక్తులు తరలివస్తారు. కానీ వారిని ఏటా సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. తాత్కలిక పనులు చేపడుతూ పాలకులు, అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో శా శ్వత పనులు పూర్తికావడంలేదు.
జాతరపై సమావేశాలేవీ?
నాగోబా జాతరలో భాగంగా ఈ నెల 30న గంగా జలానికి మెస్రం వంశీయులు పాదయాత్ర నిర్వహిస్తారు. జనవరి 18 నాగోబాకు మహా పూజ చేస్తారు. అయితే జాతర ప్రారంభానికి ముందు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావే శాలు నిర్వహిస్తారు. జాతర పనులను, ఆలయం వద్ద ఉన్న సమస్యలపై చర్చిస్తారు. పనులను ఆయా శాఖల అధికారులకు అప్పగిస్తుంటారు. కానీ నాగోబా దేవుడి మహా పూజకు మరో 25 రోజుల సమయం ఉన్నా నేటికీ అధికారులు జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు నిర్వహించలేదు. ఏటా తాత్కాలిక పనులు చేస్తూ శాశ్వత పనులను మర్చి పోతున్నారు.
మరమ్మతులకు నోచని మరుగుదొడ్లు
జాతర సందర్భంగా వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. ఐదు రోజుల పాటు సాగే యాత్రకు రెండు లక్షలకు పైగా భక్తులు మొక్కులు తరలివస్తారు. వీరితో పాటు మెస్రం వంశస్థులు వారం రోజులు అక్కడే చెట్ల నీడలో ఉంటూ, వివిధ పూజాది కార్యక్రమాలు చేపడుతుంటారు. వీరికి స్నానపు గదులు, మరుగుదొడ్లు శాశ్వతంగా ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకు నేవారే లేరు.
గుంతల రోడ్లు.. తాగునీటికి ఇక్కట్లు
జాతరకు వచ్చే భక్తులతో పాటు మెస్రం వంశస్తులు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్లు, నల్లాలు పని చేయడం లేదు. జాతరకు వారం రోజులు ముందు తాత్కాలిక పనులు చేయడంతో భక్తులు, గిరిజ నులు తాగునీటి కోసం ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇంద్రవెల్లి మండలం ముత్తునూరు నుండి కేస్లాపూర్ వరకు గల రహదారి గుంతల మయమైంది. ఈ రహదారిపై జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముత్తునూరు నుంచి ఆలయం వరకు రెండు వరుసల రహదారికి నిర్మాణానికి ప్రభుత్వం గతంలో రూ.15 కోట్లు మం జూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. జాతర సందర్భంగా క్రీడాకారులకు నిర్వహిం చే ఆటల పోటీలకు ఇబ్బందులు పడవలసి వస్తుంది. క్రీడా ప్రాంగణం వద్ద భారీ వర్షాలకు మైదానం కోతకు గురైంది.
అన్నీ సమస్యలే
నాగోబా ఆలయం వద్ద అన్నీ సమస్యలే ఉన్నాయి. ఆలయ ప్రహరీ తో పాటు జాతరలో పనులు అన్ని అసంపూర్తిగా ఉన్నాయి. పనులు పూర్తి చేయాలని ఎన్నిసార్లు అధికారులకు, మంత్రులకు విన్నవించినా ఫలితం లేదు. జాతర సందర్భంగా తాత్కాలిక పనులు చేయడంతో ఏటా సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా శాశ్వత పనులు చేయాలి.
మెస్రం వెంకట్రావు, ఆలయం పీఠాధిపతి