26-12-2025 02:31:10 AM
29 నుంచి సమావేశాలు.. సాగునీటి ప్రాజెక్టుల పంచాయితీ
కత్తులు నూరుతున్న పాలక, ప్రతిపక్షాలు
ప్రజలను ఆకట్టుకునేలా వ్యూహరచన
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన ఎజెండా
హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ఈనెల 29నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు అన్ని వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల అంశంపై వాడివేడీ చర్చకు అసెంబ్లీ వేదిక కానున్నది. సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన ఎజెండాగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోం ది. దీంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు పాలక, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
అయితే దాదాపు రెండేళ్ల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ బయటకు వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై మీడియా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. దీంతో త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశా లు కూడా ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఆయా పార్టీలు తమ చిత్తశుద్ధిని ప్రజల ముందు పెట్టేలా వ్యూహరచన చేస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులపై జరగబోయే చర్చలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజల ముందే నిలదీసే అవకాశంగా మలుచుకోవాలని బీఆర్‌ఎస్ చూస్తోంది.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కీలక సాగునీటి ప్రాజెక్టుల పూర్తి దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని ఆరోపిస్తుంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ పాలనలో త్వరితగతిన సాగిన పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల సాగునీటి కరువు ను తీర్చే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రేకులు పడ్డాయని వాదిస్తున్నది. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం, టెండర్లపై అనిశ్చితి, నిర్ణయాల లోపం వల్లే ప్రాజెక్ట్ పురోగతి నిలిచిపోయిందని సభలో ప్రశ్నించనుంది.
‘పాలమూరే’ ప్రధాన ఎజెండా...
కాళేశ్వరం తర్వాత రాష్ర్టంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పురోగతి, ఖర్చులు, ఆయకట్టు ప్రయోజనాలపై సభలో తీవ్ర రాజకీయ చర్చ జరగనుంది. అధికార కాం గ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టును పూర్తి చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చింది. అయితే పనుల పురోగతి లేకపోవడం, ఆర్థిక భారం పెరగడం వంటి అంశాలు ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రాజెక్ట్ పూర్తి గడువులు, నిధుల కేటాయింపు, రైతులకు లభించే ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వా ల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.
పాలమూరు, రంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో సాగునీటి సమస్య రాజకీ యంగా సున్నితంగా మారింది. ఈ ప్రాంతా ల్లో రైతుల స్పందనపై రెండు పార్టీలూ ప్రత్యేక దృష్టి పెట్టాయి. అసెంబ్లీలో జరిగే చర్చలు నేరుగా క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రభావం చూపే అవకాశముంది. పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీటి కేటాయింపునకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవడంపై బీఆర్‌ఎస్‌తో పాటు రైతు సం ఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా యి.
ఇది ఒక పాలనాపరమైన నిర్ణయంగా కాకుండా, సాగునీటి హక్కులను తాకట్టు పెట్టినట్టు అభిప్రాయపడుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రూపకల్పన జరిగినప్పుడు లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టుకు 45 టీఎంసీలు ఏమాత్రం సరిపోవని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు ఉద్దేశ మే దెబ్బతింటోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేటాయింపుతో ఆయకట్టు పరిధి తగ్గిపోతుందని, కొద్ది ప్రాంతాలకే నీరు అందే ప్రమా దం ఉందని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు.
ప్రాజెక్టులపై స్పష్టత కావాలి..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కేంద్రంగా చర్చ జరగబోతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికైనా స్పష్టత రావాలని రైతులు కోరుకుంటున్నారు. సంవత్సరాలుగా వాయిదాలు, ఆర్థిక భారం, పనుల మందగమనంతో ఈ ప్రాజెక్టు రాజకీయ ఆరోపణలకే పరిమితమైంది. అసెంబ్లీ వేదికగా అనేక సార్లు ఈ ప్రాజెక్టు అంశంపై చర్చలు జరిగినా ఇప్పటికీ కొలిక్కి రాకపోవడమే రాష్ర్ట పాలన వైఫల్యానికి నిదర్శనం. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఈ ప్రాజెక్టును ప్రభుత్వ చేతకానితనానికి ఉదాహరణగా చూపుతోంది.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలన తప్పిదాలే నేటి సమస్యలకు కారణమని దాటవేస్తోంది. కానీ ఈ పరస్పర ఆరో పణల మధ్య రైతులు మాత్రం సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన టైమ్‌లైన్, నిధుల లభ్యత, దశలవారీ అమలు ప్రణాళికను సభ లో ఉంచాలి. ప్రతిపక్షం కూడా కేవలం విమర్శలకే కాకుండా, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రజాఉద్యమం దిశగా..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై సమీక్షల పేరుతో కాలయాపన చేస్తోందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. అనుమతుల పేరుతో నిర్ణయాలు వాయిదా వేయడం ద్వారా రైతుల ఆశలను అణచివేస్తోందని ఆరోపిస్తోంది. గత పాలనపై నిందలు వేస్తూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నమే తప్ప, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇవ్వలేకపోతోందని అసెంబ్లీలో నిలదీయాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పష్టతరాని పక్షంలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచాం. ఇటీవల కేసీఆర్ చేసిన ప్రజా ఉద్యమాల ప్రకటన ఈ చర్చకు రాజకీయ ప్రాముఖ్యతను మరింత పెంచింది.
సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని కేవలం శాసనసభ వేదికకే పరిమితం చేయకుండా, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఉద్యమంగా మార్చే దిశగా బీఆర్‌ఎస్ అడుగులు వేయబోతోందన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులపై చూపుతున్న వైఖరి రైతుల్లో అనుమానాలను పెంచుతోందని బీఆర్‌ఎస్ అభిప్రాయపడుతోంది. పాలమూరు-రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టులపై స్పష్టమైన గడువు ప్రకటించకపోతే రైతుల ఆగ్రహం పెరిగే పరిస్థితి తప్పదని హెచ్చరిస్తోంది.
అయితే ఈ అసెంబ్లీ చర్చ బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్షంగా మరింత బలం చాటుకునే అవకాశంగా మారనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వడంలో విఫలమైతే, సాగునీటి అంశం రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు రాజకీయ బలహీనతగా మారుతుందని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సాగునీటి సమస్యలు తలెత్తాయని సభలో గట్టిగా నిలదీయడమే బీఆర్‌ఎస్ లక్ష్యంగా పెట్టుకున్నది.