03-01-2026 12:00:00 AM
ఏసీపీ కార్యాలయం మంజూరు పట్ల జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ హర్షం
ఆమనగల్లు, జనవరి 2 (విజయక్రాంతి): ఆమనగల్లు లో ఏసీపీ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పూర్వపు ఆమనగల్ బ్లాక్ సమితికి మంచి గుర్తింపు వచ్చిందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సుద్దపెల్లి వెంకటేశ్వర్లు గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో ఆమనగల్ బ్లాక్ సమితికి ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉందని ఆయన గుర్తు చేశారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గతం లో తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ప్రత్యేక కృషి తో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆమనగల్ బ్లాక్ మండలాలు ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల తో పాటు గా నూతనంగా ఏర్పడిన కర్తాల్ మండలాల ను విలీనంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. ప్రస్తుతం బ్లాక్ మండలాలు రంగారెడ్డి జిల్లాలో విలీనం కావడంతోనే ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధికి బీజం పడిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేయడం తో పాటు ఆమనగల్లు లో ఏసీపి కార్యాలయం మంజూరు చేసినందన్నారు.
ఆమనగల్ లో ఏసీపీ కార్యాలయం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి కీలకపాత్ర పోషించారని ఈ సందర్భంగా ఆయన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగానే ఆమనగల్లులో ఏసీపీ కార్యాలయం ఏర్పాటు అయిందని చెప్పారు. భవిష్యత్తులో ఆమనగల్ నియోజకవర్గ కేంద్రానికి అడుగులు పడుతున్నాయని ఆయన వెల్లడించారు. దానిలో భాగంగానే ప్రజా అవసరాల నిమిత్తం భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆమనగల్ లో ఏర్పాటుకు కానున్నాయన్నారు.
గతంలో షాద్నగర్ ఏసీపీ పరిధిలో ఉన్న ఆమనగల్లు ప్రాంతాన్ని ఆమనగల్లు, తలకొండపల్లి, ఇబ్రహీంపట్నం లో ఉన్న మాడుగుల మండలాలలోని పోలీస్ స్టేషన్ల ను మళ్ళి ఆమనగల్ పరిధిలో కి తీసుకురావడం హర్షించదగ్గ విషయమన్నారు. అయితే నూతనంగా ఏర్పడిన కర్తాల్ మండలాన్ని ఆమనగల్ ఏసిపి పరిధిలోకి తీసుకొచ్చి, ఆమనగల్ ఏసిపి పరిధి ని మహేశ్వరం జోన్ లో డీసీపీ పరిధిలోకి తీసుకొస్తే ఈ ప్రాంత ప్రజలకు పోలీసు సేవలు మరింత గా చేరువవుతాయని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమనగల్ బ్లాక్ సమితిలో ఏసీపీ ఏర్పాటుతో శాంతి భద్రతల తో పాటు నేరాల నియంత్రణ మరింత అడ్డుకట్ట పడుతుందని ఆయన పేర్కొన్నారు.