calender_icon.png 23 August, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మార్ట్ సాగుతో అద్భుత ప్రయోజనాలు

16-06-2024 12:05:00 AM

వ్యవసాయరంగంలో పోడు వ్యవసాయం మొదలుకొని సేంద్రి య వ్యవసాయంవరకు చూసాం. అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ఆధునిక టెక్నాలజీతో పాటు రసాయనిక ఎరు వులు, పురుగుల మందులను వ్యవసాయం లో వాడే విధానాన్ని చూసాం. ఆహార కొరతను అధిగమించేందుకు హరిత విప్లవాన్ని తెచ్చుకుని ఉత్పత్తులను పెంచుకున్నాం. అయితే పంట దిగుబడిని పెంచుకున్నామే కానీ భూసారాన్ని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయాన్ని మర్చిపోయాం.  ఒకవేళ గుర్తున్నా తాత్కాలిక ప్రయోజనాల కోసం ...వ్యాపార లక్ష్యంతో భూసారాన్ని కాపాడుకునే విధానాన్ని మనం పాటించడం లేదు. 

ఈ క్రమంలో ఒకవైపు భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సుస్థిర వ్యవసాయ రంగం దిశగా పయనిస్తూనే మరోవైపు వ్యవసాయ రంగంలో వేస్టేజిని అరికట్టాడానికి నేడు నూతన పద్ధతులతో చిన్న చిన్న యంత్రాలు, పరికరాలతో... కొత్త టెక్నాలజీలతో ‘స్మార్ట్ అగ్రికల్చర్’ అనే భావన ముందుకు వచ్చిం ది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతోపాటు పంట దిగుబడులను పెంచడం, శ్రమను తగ్గించుకోవడం, వృధాను అరికట్టడం మొదలైన బహుళ  ప్రయోజనాలతో స్మార్ట్ అగ్రికల్చర్ కొనసాగుతున్నది. స్మార్ట్ అగ్రికల్చర్ విధానాన్ని అనుసరిస్తున్న వారు నేడు చాలా  కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అయితే రైతులందరినీ స్మార్ట్ అగ్రికల్చర్ దిశగా ముందుకు తీసుకురావాలని పర్యావరణ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. 

ఈ స్మార్ట్ అగ్రికల్చర్‌లో సెన్సారింగ్,  ఫీల్డ్ మానిటరింగ్, అర్లీ డిసీజ్  డిటెక్షన్,  ఆటోమేటెడ్ మిషనరీ ఫర్ ఎఫిషియన్డ్ హార్వెస్టింగ్, ట్రాకింగ్ సిస్టం ఫర్ ఇంప్రూవింగ్ లైవ్ స్టాక్ మేనేజ్‌మెంట్  మొదలైన అంశాలు ఇమిడి ఉన్నాయి. చిన్న కమతాలు ఉన్న సన్న,చిన్నకారు రైతులు మొదలుకొని పెద్ద కమతాలు ఉన్న రైతులు కూడా స్మార్ట్ అగ్రికల్చర్ విధానాన్ని పాటించవచ్చు. 

సెన్సార్లతో భూమి ఆరోగ్యం అంచనా

సెన్సార్లను ఉపయోగించుకొని సెన్సారింగ్ చేయడం అనేది ఒక ప్రక్రియ.  సాయి ల్ మాయిశ్చర్ పరికరాలు సాగుభూమిలో  తేమ ఎంత ఉంది, ఎసిడిటీ , అల్కిలినిటీ  గురించి పూర్తి వివరాలు ఈ సెన్సార్ల ద్వారా మనకు తెలుస్తాయి. సెన్సార్లలో ఎలక్ట్రో మాగ్నెటిక్ సెంటర్ సెన్సార్లు, మెకానికల్ సెన్సార్లు, ఇంటెలిజెంట్ సెన్సార్లు ఉంటా యి. ఇవన్నీ కూడా గాలి ఉష్ణోగ్రతను,  తేమ శాతాన్ని,  వెలుతురు శాతాన్ని,  కార్బన్‌డయాక్సైడ్ స్థాయిలు , పశువుల ఆరోగ్యం,  పంటలకు తెగుళ్లు, పురుగులు   ఎక్కడ పట్టా యో కూడా తెలియజేస్తాయి. రైతులకు  శ్రమను తగ్గిస్తూ  వ్యవసాయ ఉత్పత్తిలో లాభాలను చూపెడుతూ మరోవైపు సేంద్రి య వ్యవసాయాన్ని కొనసాగించేలా స్మార్ట్ వ్యవసాయం ఉపకరిస్తుంది. వాతావరణ ప్రభావంతో పాటు విత్తనాలను ఏ సమయంలో వేయాలి,  ఏ సమయంలో పంట కలుపు తీయాలి, ఏ సమయంలో మందు కొట్టాలి అనే విషయాలపై సెన్సార్లు  రైతులకు అవగాహన కల్పిస్తాయి.

చిన్న రైతులకు లాభదాయకం 

ఈ స్మార్ట్ అగ్రికల్చర్  విధానాన్ని పాటించడానికి చిన్న రైతులపై ప్రభుత్వం కేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో చిన్న రైతులు ఒకసారి మాత్రమే పెట్టుబడి పెట్టి సెన్సార్లను ఉపయోగించుకొని దాదాపు ఐదారు సంవత్స రాలు వ్యవసాయం చేయవచ్చు. ఉదాహరణకు ఐదెకరాల రైతు తన చేనుకు మందు కొట్టడానికి  డ్రోన్‌ను ఉపయోగించుకున్నప్పుడు  మొదటిసారి లక్ష నుంచి లక్షన్నర రూపాయలదాకా ఖర్చు వస్తుంది. అయితే సుమారు 5 లీటర్ల వరకు కెమికల్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉన్న డ్రోన్‌తో ఒకే  వ్యక్తి  ఒకచోట కూర్చుని ఐదెకరాల విస్తీర్ణం ఉన్న పంటలపై  క్రిమిసంహారక మందులను చల్లే అవకాశం ఉంది.అదే మనుషులను ఉపయోగిస్తే నాలుగు రోజుల సమయం తీసుకోవడమే కాకుండా ఆరేడు వేల రూపాయల ఖర్చును లేబర్‌పై పెట్టాల్సి వస్తుంది. 

ఒక పంట పూర్తి అయ్యేసరికి సుమారు మూడుసార్లు క్రిమిసంహారక మందులను చల్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్క పంట కోసమే 5 ఎకరాల భూమిలో సుమారు 20వేల రూపాయలను ఒక సీజన్లోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని.  అదే డ్రోన్ విధానాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఎలాంటి మనుషుల అవసరం లేకుండానే ఒకే ఒక్క వ్యక్తి ఆపరేట్ చేస్తూ ఒక రోజులోనే ఐదెకరాల పంట భూమిలో క్రిమిసంహారక మందులను పిచికారి చేయవచ్చు. ఈ డ్రోన్  పరికరం సుమారు పది సంవత్సరాల వరకు పని చేస్తుంది.

అంటే 10 సంవత్సరాలకు ఏటా రెండు పంటలు గనుక తీసుకుంటే సుమారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వ్యయాన్ని క్రిమిసంహారక మందులు చల్లడానికి ఉపయోగించే లేబర్‌కు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ డ్రోన్ విధానాన్ని ఉపయోగించడం వల్ల లేబర్ అవసరం లేకుండా కష్టపడకుండానే.. ఒక్కరోజులోనే క్రిమిసంహారక మందులను చల్లవచ్చు.  పెట్టుబడి, శ్రమ,  సమయం.. ఏ విషయంలో చూసినా డ్రోన్ ద్వారా రసాయనిక మందులను,  సేంద్రియ ఎరువులను చల్లడం చాలా సులువైనదిగా, తక్కువ వ్యయంతో కూడుకున్నదిగా మనకు కనిపిస్తోంది. 

 కరెంటు మోటారు, నీళ్లు 

 రైతులు తమ పంట భూముల్లో నీళ్లను సరఫరా చేయడానికి సాధారణంగా సాగు భూమి వద్దకే వెళ్లి మోటార్ ఆన్.. ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే స్మార్ట్ అప్లికేషన్‌ను ఉపయోగించి రైతులు తమ సెల్ ఫోన్ ద్వారానే వ్యవసాయ మోటారును ఆన్ చేయవచ్చు.అలాగే నీళ్లు ఏ మడిలోకి వెళుతున్నాయో కూడా చూడవచ్చు. పంట భూమికి నీళ్లు సరిపోయిన తర్వాత ఇదే మొబైల్ ఫోన్ ద్వారా పంపుసెట్లు ఆఫ్ చేయవచ్చు.  దీనినే రియల్ టైం మానిటరింగ్ మెథడ్ అంటారు. 

సవాళ్లు, పరిష్కారాలు

స్మార్ట్ వ్యవసాయంపై మొదట రైతులకు అవగాహన కల్పించాలి.  స్మార్ట్ వ్యవసాయానికి అవసరమైన ఉపకరణాలను, సెన్సార్లను కొనుగోలు చేయడానికి సబ్సిడీలను ప్రభుత్వమే అందించాలి. బ్యాంకులనుంచి రుణ సదుపాయాన్ని కూడా కల్పించి వాయిదా పద్ధతిలో చెల్లించేలా అవకాశం కల్పించాలి.  స్మార్ట్ వ్యవసాయ ఉపకరణాలను ఎలా వాడాలనే అంశంపై రైతులకు శిక్షణ శిబిరాలను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.  స్మార్ట్ వ్యవసాయ ఉపకరణాలను వాడేందుకు అవసరమైన ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.

స్మార్ట్ వ్యవసాయం చేస్తున్న రైతుల డేటా ప్రైవసీగానే ఉండాలి. ఇతరులు తస్కరించకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.  ఇందుకు ప్రభుత్వం కూడా తగిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది.  స్మార్ట్ వ్యవసాయ సాగు విధానంపై  రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి.  ఇందుకోసం మీడియాను, స్వచ్ఛంద సంస్థలను, రైతు సంఘాలను ఉపయోగించుకోవాలి. 

ఫోన్: 8121184095