16-06-2024 12:05:00 AM
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడింది కల్లుగీత వృత్తి. దీనినే నమ్ముకుని ఇప్పటికి కొన్నివేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. పల్లెలలో ఈ వృత్తిని నమ్ముకుని ఎక్కువగా ఉన్నారు. గతంలో వీరి కుటుంబాలు వైభవంగా, ఉన్నతంగాఉండేవి. నాటి గౌడ కులవృత్తి వ్యవస్థలో గీతకార్మికులే మూలస్థంభాలుగా ఉండేవారు. నేడు గీతన్నల బతుకులకు భరోసా కరువైంది. పాలకులకు చిత్తశుద్ది లేకుండా పోయింది.
నేటి గీతకార్మికుల స్థితిగతులు చిద్రమై, అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ వృత్తిని 19 ఏళ్ళ నుంచి దాదాపు 75 సంవత్సరాల వయస్సు కలవారు సైతం చేస్తున్నారు. బతుకు జీవన పోరాటంలో ప్రతి రోజు ఏదో ఒక మూలన పిట్టల్లా రాలిపోతున్నారు. తాడు ఎక్కే క్రమంలో మోకు జారిన, కాలు జారిన, చెట్టు విరిగిన పురుగు ముట్టిన మరుక్షణం ప్రాణం గాలిలో కలుస్తుంది. ఇంత ప్రమాదకరమైన వృత్తిని వదులుకోలేక, కుటుంబాలను పోషించలేక జీవచ్చవాల్లా బతుకుతున్నారు. గీతన్నల శరీరం ఓ దెబ్బల కొలిమై, వారి చేతులు నెర్రెలు వారి పగుళ్లతో ఉంటాయి.
వృత్తి చేసేవారి కుటుంబాలలో బాధలు వర్ణనాతీతం. అనాదిగా వస్తున్న గీతవృత్తిని సవ్యంగా చేసుకునే విధంగా చూసి ప్రభుత్వాలు వృత్తి రక్షణ కల్పించాలి. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ప్రతి గీతకార్మికునికి వృత్తి పరంగా 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలి. నీరా స్టాల్స్ ఏర్పాటు చేసి వాటికి గౌడ కులస్థులను భాగస్వామ్యులను చేయాలి. గౌడ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతకు చేయూతనివ్వాలి. ప్రభుత్వాలు మారాయి, నాయకులు మారారు. కానీ, తరాలు మారినా గీతన్నల తలరాతలు మారడం లేదు. ఇప్పటికైనా పాలకులు గౌడన్నల పట్ల చిత్తశుద్దితో వారి మొరలను ఆలకించాలి. గీతకార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలి.
-కామిడి సతీశ్ రెడ్డి