calender_icon.png 18 July, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపులులకు ఆవాసంగా అమ్రాబాద్!

18-07-2025 12:19:06 AM

  1. ఏడాదిలో 33 నుంచి 36కు పెరగడమే ఆధారం
  2. ఆడ పులుల సంఖ్యలో భారీగా పెరుగుదల
  3.    1,594 కెమెరాట్రాప్‌ల ద్వారా గుర్తింపు
  4. ఫేజ్-4 మానిటరింగ్‌లో వెల్లడించిన అధికారులు

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణలో పెద్దపులుల సంరక్షణకు ప్రభుత్వం, అటవీశాఖ తీసుకుంటున్న సంరక్షణ చర్యలతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం వాటికి ఆవాసంగా మారుతోంది. నల్లమల అడవుల మధ్యన టైగర్ రిజర్వ్ జోన్ అయిన ఆమ్రాబాద్‌లో గడిచిన సంవత్సర కాలంలోనే పెద్దపులుల సంఖ్య 33 నుంచి 36కు పెరగడాన్ని అటవీశాఖ ఇందుకు ఆధారంగా చూపిస్తోంది.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) ప్రాంతంలో 2024 డిసెంబర్ 20 నుంచి 2025 మే 15 తారీఖు వరకు 1,594 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. దీనిద్వారా 787 గ్రిడ్ ప్రాంతాల్లో (ఒక్కోటి 2 చదరపు కి.మీ. ప్రాంతం) ఈ కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.

ఇందులో నిక్షిప్తమైన పులుల ఫొటోలతోపాటు ఆయా ప్రాంతా ల్లో లభ్యమైన పగ్‌మార్క్‌లు, గోళ్లతో గీరిన మార్క్‌లను పరిశీలించగా.. 2023-24లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 33 పెద్దపులులు ఉండగా.. 2024-25 నాటికి 36కు పెరిగినట్టు ఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ హైర్మత్ తెలిపారు.

నాలుగో ఫేజ్‌లో చేసిన సర్వేకు సంబంధించిన వివరాలను గురువారం ఏటీఆర్ డైరెక్టర్ వెల్లడించారు. ఈసర్వేను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం నిర్వహించామని, సర్వే మొత్తం 10 ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిని నాలుగు ప్రత్యేక బ్లాకులుగా విభజించి.. కచ్చితమైన సమాచారం లభించేలా ఒక క్రమపద్ధతిలో నిర్వహించామని తెలిపారు.

2023-24తో పోల్చితే 2024-25లో పెద్దపులుల సంఖ్య 33 నుంచి 36కు పెరిగిందని, ఇందులో రెండు చిన్న పులి కూనలు ఉన్నాయని, వయస్సుకు వచ్చిన పులుల సంఖ్య 26 నుంచి 34కు పెరగడంతో ఏటీఆర్ ప్రాంతంలో పులుల ఆవాసానికి సరైన వాతావరణం ఉందనేదానికి ఉదాహరణ అని తెలిపారు. దీంతోపాటు ఆడ పులుల సంఖ్యకూడా గణనీయంగా 15 నుంచి 20కి పెరగడం శుభపరిణామమన్నారు. 

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణ కోసం అటవీశాఖ (వైల్డ్‌లైఫ్) ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. సమర్థులైన ఫారెస్ట్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక గిరిజన యువతకు అవగాహనతోపాటు పులుల సంరక్షణలో ప్రాధాన్యం కల్పించడం, పులుల ఆవాసానికి కావాల్సిన చర్యలు తీసుకోవడంతోనే ఇది సాధ్యమయ్యింది. పైగా పులి పిల్లలు సురక్షితంగా పెరిగి పెద్దవవుతున్న సంకేతాలు కూడా స్పష్టమవుతున్నాయి.