24-01-2026 01:05:14 AM
మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు, ఒక ప్యాసింజర్ కూడా..
త్రివేండ్రం/ చెన్నై, జనవరి ౨౩: చర్లపల్లి -తిరువనంతపురం (త్రివేండ్రం) వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు తిరువనంతపురం -తాంబరం, నాగర్ కోయిల్- మంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు, ఒక త్రిస్సూర్ గురువాయూర్ ప్యాసింజర్ రైలును శుక్రవారం సీఎం పినరయి విజయన్‌తో కలిసి తిరువనంతపురంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రవాణాపరంగా దక్షిణాది రాష్ట్రాల మధ్య మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు. రాష్ట్రాల మధ్య రవాణాపరమైన అనుసంధానం కల్పించడమే కేంద్రప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
బీజేపీకి కేరళ ప్రజలు బ్రహ్మరథం
ప్రధాని మోదీ అనంతరం త్రివేండ్రంలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాని మాట్లాడుతూ.. రాజకీయంగా కేరళ ప్రజల్లో మార్పు మొదలైందని, వారు బీజేపీని సాదరంగా ఆదరిస్తున్నారని, అందుకు నిదర్శనమే త్రివేండ్రం నగరపాకల సంస్థ ఎన్నికల్లో పార్టీ విజయమని పేర్కొన్నారు. కేరళలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అవినీతిని అంతం చేసి తీరుతామని ప్రతినబూనారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గొప్ప పాత్ర పోషిస్తుందని జోస్యం చెప్పారు.
రాష్ట్రప్రజలకు బీజేపీపై అపారమైన నమ్మకం ఉందని, అందుకే తమకు మున్సిపల్ ఎన్నికల్లో బ్రహ్మరథం పలికారని చెప్పుకొచ్చారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యం వల్లే శబరిమల ఆలయంలో బంగారం చోరీకి గురైందని ఆరోపించారు. అనంతరం ప్రధాని తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని మధురాంతకానికి చేరుకున్నారు. అక్కడ బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధికార పార్టీ డీఎంకేపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఎంకే అంటే సీఎంసీ ప్రభుత్వమని.. అంటే కరప్షన్, మాఫియా, క్రైం అంటూ ప్రధాని కొత్త నిర్వచనమిచ్చారు.
డీఎంకేకు తమిళనాడు ప్రజలు రెండుసార్లు పూర్తి మెజారిటీ ఇచ్చి, అధికారం కట్టబెట్టారని, అయినప్పటికీ ఆ పార్టీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గడిచిన 11 ఏళ్లలో తమిళనాడు అభివృద్ధికి వేల కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని మండిపడ్డారు.
నీ చిరునామా ఇవ్వు: మోదీ
తిరువనంతపురం బీజేపీ ర్యాలీలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. జనసందోహం మధ్య నుంచి ఒక చిన్న బాలుడు తన చేతుల్లో మోదీ చిత్రపటాన్ని ఎత్తిపట్టుకుని కనిపించాడు. చాలాసేపటి నుంచి బాలుడు ఆ చిత్రపటాన్ని పట్టుకుని ఉండటాన్ని మోదీ గమనించి స్పందించారు. ‘బాబూ.. నువ్వు ఎక్కువ సేపు అలా చిత్రపటం పైకెత్తి నిలబడితే అలసిపోతావు. నీ చేతులు నొప్పెడతాయి. ఆ చిత్రపటాన్ని ఇకనైనా దించు. నీ చిరునామా రాసి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కి ఇవ్వు. నీకు నేను స్వయంగా లేఖ రాస్తా’ అని మోదీ పిలుపునివ్వడంతో అక్కడ కరతాళ ధ్వనులు మార్మోగాయి.