calender_icon.png 20 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవిలో అమానవీయ ఘటన!

20-09-2025 12:15:13 AM

  1. గిరిజన మహిళ మృతదేహాన్ని అటవిలో వదిలివెళ్లిన పార్థీవ దేహ వాహన సిబ్బంది 
  2. రాత్రంతా మృతదేహం వద్దే చెంచుల జాగారం 

నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన చెంచు మహిళ మృతదేహాన్ని పార్థీవదేహ వాహనం నేరుగా ఇంటి వద్దకే చేర్చాల్సి ఉండగా నడి అడవిలో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆ మృతదేహం వద్దే కుటుంబ సభ్యులు రాత్రంతా చలికి వణుకుతూ..

చిమ్మ చీకట్లో జాగరణ చేస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ఈర్లపెంట చెంచుపెంట నివాసి మండ్ల గురువమ్మ(30) గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పది రోజుల పాటు చికిత్స పొందుతూ సాయంత్రం మృత్యువాత పడింది.

దీంతో అక్కడే ఉన్న ప్రభుత్వ పార్థీవదేహ వాహనం సిబ్బంది మృతదేహాన్ని సొంత గ్రామంలో విడిచి పెట్టాల్సి ఉంది. కానీ శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చిమ్మ చీకటి ఉందని కూడా పట్టించుకోకుండా అమ్రాబాద్ మండలం ఫరిహాబాద్ వద్ద అటవీ ప్రాంతంలోనే వదిలేశారు. దీంతో చేసేది లేక వెంట వచ్చిన చెంచు కుటుంబాలు రాత్రంతా మృతదేహం వద్దే బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఉదయం 9 గంటల ప్రాంతంలో స్థానికుల సహాయంతో ప్రైవేట్ వాహనంలో చెంచు పెంటకు తరలించారు. ఈ ఘటనపై అంబులెన్స్ వాహన సిబ్బందితోపాటు ఐటీడీఏ అధికారుల  తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని, మానవత్వాన్ని మరచి అడవిలోనే మృతదేహాన్ని వదిలారని చెంచులు ఆరోపిస్తున్నారు.