10-01-2026 01:36:04 AM
మేడారం, జనవరి 9(విజయక్రాంతి): మేడారం మహా జాతరకు 12 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో వరంగల్, రామగుండం సీపీలు సన్ ప్రీత్ సింగ్, అంబర్ కిషోర్ ఝా, 15 మంది ఎస్పీ స్థాయి అధికారులు, 20 మందికి పైగా ఐపీఎస్ ఆఫీసర్లు మేడారం జాతర బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటారని ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ తెలిపారు.గతంతో పోలిస్తే ఈసారి 30 శాతం అధికంగా భక్తులు మేడారం వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా ప్రత్యేక పార్కింగ్, హోల్డింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
అలాగే 430 సీసీ కెమెరాలు, 20 డ్రోన్ కెమెరాల ద్వారా ములుగు గట్టమ్మ దేవాలయం నుంచి మేడారం జాతర వరకు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ చేస్తామన్నారు. ప్రైవేట్ వాహనాల్లో వచ్చే వారిని పసర నుంచి ప్రాజెక్ట్ నగర్, నార్లాపూర్, ఊరట్టమ్ ద్వారా మేడారం రావడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రైవేట్ వెహికల్ పార్కింగ్ , భక్తులు విడిది చేసేందుకు గుర్తించిన ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.
మేడారం జాతరకు మొత్తం ఐదు మార్గాలు రాకపోకలు సాగించడానికి అనువుగా ఉన్నాయని, ఇందులో కొన్ని ఒకే మార్గంలో పయనించడానికి, మరికొన్ని ఇరువైపులా ప్రయాణించడానికి అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు.క్లౌడ్ మేనేజ్‌మంట్ ప్రకారం భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గతంలో ఒకేసారి 3వేల నుంచి 5వేల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉండగా, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒకేసారి 9వేల నుంచి 10 వేల మంది భక్తులు సులువుగా దర్శనం చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే రోప్ పార్టీ వినియోగిస్తామన్నారు. కాగా, మేడారం గద్దెల ప్రాంగణంలో చేపట్టిన నిర్మాణ పనుల్లో పోలీసులు భాగ స్వాములయ్యారు. స్వయంగా ఎస్పీ కేకన్ సుధీర్, సిబ్బంది అక్కడ పాత ఫ్లోరింగ్ రాళ్లను తొలగించి సందడి చేశారు.