calender_icon.png 3 January, 2026 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు అంజన్న సేవలో ఏపీ డిప్యూటీ సీఎం

03-01-2026 12:14:20 AM

  1. కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయనున్న పవన్‌కళ్యాణ్

35.19 కోట్ల టీటీడీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన    

హైదరాబాద్, జనవరి ౨(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ శనివారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రానున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ్య ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మంజూరు చేసిన రూ.35.19 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పవన్‌కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం పవన్‌కళ్యాణ్ ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో మాట్లాడి రూ.35.19 కోట్లు మంజూరు చేయించారు.

ఈ నిధులతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి రెండువేల మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు.  శంకుస్థాపన కార్యక్రమం పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ రాజకీయ అంశాలపై దృష్టి సారిస్తారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో జనసేన తెలంగాణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో విజయం సాధించిన అభ్యర్థులను ఆయన అభినందించనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ విప్ పిడుగు హరిప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి తదితరులు పవన్ వెంట ఉంటారు.