03-01-2026 12:15:54 AM
ఆటో కార్మికుల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టడం లేదని అసెంబ్లీ ముట్టడి
రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ
ముషీరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): 2014 సంవత్సరం నుండి పెండింగ్ లోఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అవసరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు నిరసిస్తూ వేలాది మంది ఆటో రిక్షా డ్రైవర్లతో ఈ నెల 3న అసెంబ్లీని ముట్టడిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ హిమాయత్ నగర్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ కన్వినర్ బి. వెంకటేశం, జేఏసీ నేతలు వేముల మారయ్య (బీఆర్‌టీయూ), ఎంఏ. సలీం (తెలంగాణ జాగృతి), ఇ. ప్రవీణ్ (టీయూసీఐ), ఏ. సత్తి రెడ్డి (టీఏడీఎస్), పీ. యాదగిరి (టీఎన్‌టీయూసీ), శివానందం (టీఏఏండీయూ) ఎండీ. బాబా (సిఐటియు) లు పాల్గొన్నారు.
ఈ సందర్బం గా జేఏసీ కన్వీనర్ బి. వెంకటేశం మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి ఇప్ప టివరకు ఆటో మీటర్ చార్జీలు పెంచలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం వల్ల బేరాలు లేక ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మ్యా నిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఆటో డ్రైవర్ కు రూ. 12 వేల ఆర్థిక సహాయం, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు వంటి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఫుర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే అసెంబ్లీ ముట్టడి తరువాత రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్ తో పాటు రోజువారీ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రేపటి అసెంబ్లీ ముట్టడికి ఆటో డ్రైవర్లు భారీఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని బి. వెంకటేశం పిలుపునిచ్చారు. వీ. మారయ్య మాట్లాడుతూ ఆటో మీటర్ చార్జీలు కిలో మీటర్ కు రూ.20, మినిమం ఛార్జి రూ.50 కు వెంటనే పెంచాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో ఎం ఎ సలీం, ఎ. సత్తి రెడ్డి, పి. యాదగిరి, శివానందం, ఎస్. అశోక్, సిహెచ్. జంగయ్య, ఎం. కృష్ణ, ఎం. నరసింహ, శ్రీనివాస్, (ఏఐటీయూసీ), లింగం గౌడ్ (టి.యు.సి.ఐ), ఫయాజ్ (తెలంగాణక్ జాగృతి) లు పాల్గొన్నారు.