26-09-2025 12:41:32 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మ కంగా తీసుకున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సానుకూల అడుగులు పడుతున్నాయి. సమ్మ క్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వ ప్రతిపాదనలకు సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) సంతృప్తి వ్యక్తం చేసింది. గురువా రం సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం సూత్రప్రాయ అంగీకారం తెలపగా తాజాగా సీడబ్ల్యూసీ మీటింగులోనూ కేంద్రం అదే పాజిటివ్ వైఖరి చూపడం విశేషం. సమ్మక్క ప్రాజెక్టుపై కేంద్రానికి ఉన్న అభ్యంతరాలపై తెలంగాణ అధికారులు సమావేశం సందర్భంగా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రతిపాదనలపై సీడబ్ల్యూసీ సంతృప్తి వ్యక్తం చేసిందని అధికారు లు తెలిపారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఈ ప్రాజక్టుకు సంబంధించి ఎన్‌వోసీ ఇస్తే నిర్మాణం చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుంది.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌వోసీపైనే ఆధారం
ములుగు జిల్లాలో రూ.9,257 కోట్లతో గోదావరిపై తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పనులు దాదాపు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. అయితే.. గత ప్రభు త్వం చేసిన తప్పిదంతో ప్రాజెక్టుకు అనుమతులు రాకపోవడంతో ముందుకు కదలలేదు. మెరుగైన వ్యయ నిష్పత్తిని చూపేందుకే ఎస్సారెస్పీ రెండోదశ ఆయకట్టు స్థిరీకరణను సైతం సమ్మక్క ప్రాజెక్టు ఖాతాలో చేర్చగా.. కేంద్ర జల సంఘం పరిశీలనలో వాస్తవాలు బయటపడ్డాయి.
దీంతో ఒకే ఆయకట్టును ఎస్సారెస్పీ 2, కాళేశ్వరం, సమ్మక్కసాగర్ ప్రాజెక్టుల కింద ఎలా చూపిస్తారంటూ రాష్ర్ట నీటిపారుదల శాఖను వివరణ కోరింది. దాంతో సమ్మక్క సాగర్ అనుమతులకు కాస్త బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్టు అనుమతులు సాధించాలంటే కొత్తగా 2 లక్షల ఎకరాల ప్రత్యేక ఆయకట్టును ప్రతిపాదించగా దానికి ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకోవాలని సీడబ్ల్యూసీ సూచించింది.
అందులో భాగంగానే ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ రాష్ర్ట సీఎంతో భేటీ అయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఉద్దేశాలను ఆయనకు వివరించారు. దీంతోపాటు ఆ రాష్ర్టంలో జరుగుతున్న నష్టానికి పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించేందుకు అంగీకరించారు. దాంతో అక్కడి సీఎం ఎన్‌వోసీ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే అక్కడి ప్రభుత్వం ఎన్‌వోసీ ఇచ్చిన వెంటనే సీడబ్ల్యూసీ నుంచి సైతం మిగిలిన అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.