calender_icon.png 26 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీవారి బ్రహోత్సవాలు

26-09-2025 01:27:19 AM

  1. రాత్రి వీణాపాణిగా దర్శనమిచ్చిన తిరుమలేశుడు
  2. ఉదయం శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు కనువిందు

తిరుమల, సెప్టెంబర్ 25: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి శ్రీవారు హంస వాహనంపై సరస్వతీ దేవి అలంకారంలో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీవారు మలయప్ప స్వామివారు వీణాపాణియై హంస వాహనంపై దర్శనమిచ్చారు.

బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరుడిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతిని కలిగిస్తాడని విశ్వాసం.

భక్తుల కోలాటలు, మంగళవాయిద్యాలు, కళాకారుల ప్రదర్శన నడుమ హంసవాహన సేవను కనుల పండువుగా సాగింది. అలాగే ఉత్సవాల్లో భాగంగా ఉదయం మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి వాహన సేవలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చారు.  వాహన సేవలో తిరుమల శ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్లులు, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.