26-09-2025 01:26:47 AM
-గాలిలో విషం..బతుకుపై భయం
-తడి, పొడి చెత్తను కలిపి కాల్చుతున్న వైనం
-జవహర్‌నగర్, దుండిగల్ డంపింగ్ యార్డుల నిర్వహణపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సంచలన నివేదిక
-డబ్ల్యూహెవో పరిమితికి 1,200 రెట్లు అధికంగా కాడ్మియం
-స్థానికులకు క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల ముప్పు
-కొన్ని రోజులుగా శ్వాసకోశ, చర్మ వ్యాధులతో నరకయాతన
-తక్షణమే ప్లాంట్లు మూసేయాలని పర్యావరణవేత్తల డిమాండ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): నగర శివార్లలోని జవహర్‌నగర్, దుండిగల్ డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజల ప్రాణా లు ప్రమాదం అంచున వేలాడుతున్నాయి. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి (వేస్ట్ టు ఎనర్జీ) పేరుతో రాంకీ సంస్థ నిర్వహిస్తున్న ప్లాంట్ల నుంచి వెలువడుతున్న బూడిద విషాన్ని చిమ్ముతూ యమపాశంలా మారుతోంది.
ఈ బూడిదలో క్యాన్సర్, కిడ్నీ వ్యాధు లకు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన కాడ్మియం వంటి భార లోహాలు ప్ర పంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి కన్నా ఏకంగా 1,200 రెట్లు అధికంగా ఉన్న ట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తన నివేదికలో తేల్చడం తీవ్ర కలకలం రేపుతోంది. రాంకీ సంస్థ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, తడి-పొడి చెత్తను వేరు చేయకుండా కలిపి కాల్చేస్తుండటమే ఈ ఘోర విపత్తుకు కారణమని స్పష్టం చేసింది. సీపీసీబీ నివేదిక ప్రకారం జవహర్‌నగర్ ప్లాంట్ బూడిదలో కాడ్మియం స్థాయి కిలో కు 858.65 మిల్లీగ్రాములుగా ఉంది. ఇది డబ్ల్యూహెఓ అనుమతించిన 0.8 మీ.గ్రా/ కేజీ పరిమితి కంటే 1,073 రెట్లు ఎక్కువ.
ఇక దుండిగల్ ప్లాంట్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడి బూడిదలో కాడ్మియం ఏకంగా 956.69 మి.గ్రా/కేజీ గా నమోదైం ది. అంటే, సాధారణ పరిమితి కన్నా 1,195 రెట్లు అధికం. క్రోమియం వంటి ఇతర భార లోహాలు కూడా పరిమితికి మించి ఉన్నాయని నివేదిక హెచ్చరించింది. నిబంధనల ప్రకారం, ఈ బూడిదను ఇటుకల తయారీకి లేదా సిమెంట్ పరిశ్రమలకు తరలించాలి. కానీ, రాంకీ సంస్థ ఆ బూడిదను డంపింగ్ యార్డులోనే పారబోస్తోందని, దీనివల్ల భూమి, భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమై పర్యావరణానికి, ప్రజా ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని సీపీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది.
దగా చేస్తున్న యాజమాన్యం
2025 ఏప్రిల్‌లో గ్రేటర్ చెన్ను కార్పొరేషన్ అధికారులు ఈ ప్లాంట్లను సందర్శించి నప్పుడు, ఇది జీరో వేస్ట్ ప్లాంట్ అని, బూడి ద మొత్తాన్ని సిమెంట్, ఇటుక పరిశ్రమలకు పంపిస్తున్నామని రాంకీ యాజమాన్యం అబద్ధాలు చెప్పిందని సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీకి చెందిన చైతన్య దేవిక కులశేఖరన్ ఆరోపించారు. వాస్తవాలు ఇంత భయంకరంగా ఉంటే, యాజమాన్యం అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తోందని పర్యావరణవేత్తలు మండిపడుతు న్నారు. తక్షణమే స్వతంత్ర దర్యాప్తు జరిపి, నిబంధనలు పాటించే వరకు ప్లాంట్ల కార్యకలాపాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రోగాల బారిన స్థానికులు
డంపింగ్ యార్డుల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఇప్పటికే నరకం అనుభవిస్తున్నారు. 2025 మేలో సివిల్ సొసైటీ విడుదల చేసిన నిజ నిర్ధారణ నివేదిక ప్రకారం, ఈ ప్రాంతా ల్లో శ్వాసకోశ సమస్యలు, కిడ్నీ వైఫల్యాలు, తీవ్రమైన చర్మ వ్యాధులు విపరీతంగా ప్రబలాయి. గాలిలో కలిసిన బూడిద కణాల వల్ల గొంతు, నోటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. బయట బట్ట లు ఆరేస్తే వాటిపై బూడిద పేరుకుపోతోంది. ఆ బట్టలు వేసుకుంటే చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తున్నాయి అని స్థానికులు వాపోతు న్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది సరైన వైద్యం కూడా చేయించుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.