16-10-2025 02:37:44 AM
-సరిహద్దు ప్రాంతాల్లో భీకర దాడులు
-పాకిస్థాన్ అవుట్ పోస్ట్‌పై డ్రోన్‌దాడి
-ఇరువైపులా 50 మంది వరకు మృతి
-వందాలది మందికి గాయాలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 15: పాకిస్థాన్ మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో మార్మోగుతున్నాయి. పాకిస్థాన్ అవుట్ పోస్ట్ అఫ్గాన్ డ్రోన్‌దాడులు చేసింది. ఈ భీకర దాడుల్లో ఇరు దేశాలకు చెందిన 50 మంది వరకు మృతిచెంనట్టు తెలుస్తోంది. సరిహద్దు వివాదం మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ వైమానిక దళం అఫ్గానిస్తాన్ లోపల దాడులు చేసింది.
కాందహార్‌లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో జరిగిన వైమానిక దాడిలో 15 మంది వరకు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. పాక్ దాడికి దీటుగా తమ సైన్యం కూడా ఎదురు దాడి చేస్తోందని అఫ్గాన్ తెలిపింది. అఫ్గాన్‌లోని జజాయ్ మైదాన్, షార్కో, ఖైబర్ ప్రాంతాల్లో పాక్ దాడులు చేసింది. దీంతో అప్రమత్తమైన అఫ్గాన్ సైన్యం ప్రతిదాడికి దిగింది. పాకిస్థాన్ అవుట్ పోస్టుపై తాలిబన్లు డ్రోన్ దాడి చేశారు. ఈ దాడుల్లో చాలా మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అలాగే ఎంతో మంది సైనికుల ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదట.
స్పిన్ బోల్డాక్ గేట్ వద్ద తాలిబన్, పాకిస్థాన్ దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది తాలిబన్ సైన్యం మృతి చెందినట్లు పాక్ ఆర్మీ చెబుతోంది. అఫ్గాన్ అయితే 15 మంది పౌరులు చనిపోయినట్లు పేర్కొంటుంది. స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో బుధవారం ఉదయం 4 గంటల సమయంలో పాక్ దళాలు, తాలిబన్ల యోధుల మధ్య భీకరపోరు జరిగింది. ఈ పోరాటంలో తాము విజయం సాధించామని, 15 నిమిషాల్లోనే పాక్ సైనికులు లొంగిపోయారని తాలిబన్లు ప్రకటించుకున్నారు.
ఇరువైపులా 50 మంది వరకు మృతిచెందినట్లు, వందలాది మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. భారత్‌కు అఫ్గాన్ దగ్గర కావడాన్ని పాకిస్థాన్ తట్టుకోలేక రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. ఆ దేశ విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటిస్తున్న సయంలోనే అఫ్గాన్‌లో పాక్ ఆర్మీ కాల్పులకు దిగింది. ఇరు దేశాల మధ్య పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, శాంతిని పునరుద్ధరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివిధ దేశాల అధినేతలు పిలుపునిచ్చారు. అయితే ౪౮ గంటల కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి.