17-02-2026 02:04:39 AM
ఇప్పటివరకు 17 మున్సిపాలిటీలపై గులాబీ జెండా
సొంతంగా గెలిచిన స్థానాలను నిలుపుకున్న బీఆర్‌ఎస్
హంగ్ మున్సిపాలిటీలకు ఇంచార్జ్‌ల నియామకం
ఎమ్మెల్యేలు, మాజీలు, స్థానిక నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): తెలంగాణలో తాజా మున్సిప ల్ ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 17 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ముఖ్యంగా గతంలో గెలిచిన మున్సిపాలిటీలను తిరిగి నిలబెట్టుకోవడం గులాబీ పార్టీకి కీలక విజయంగా నిలిచింది. దీంతో బీఆర్‌ఎస్ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, స్థానిక నాయకత్వం, క్యాడర్ సమన్వయం, ప్రజలతో ఉన్న అనుబంధం వల్లే ఈ ఘనత సాధించగలిగినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇదే సమ యంలో ప్రస్తుతం వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీల్లో 8ని ఎట్టిపరిస్థితుల్లో దక్కించుకోవాలని బీఆర్‌ఎస్ పకడ్బందీ వ్యూహంతో అడుగులేస్తూ.. కాంగ్రెస్ అరాచకాలకు, కుతంత్రాలకు చెక్ పెట్టేలా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ లు, స్థానిక నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ దిశా నిర్దేశం చేశా రు. రాష్ట్రవ్యాప్తంగా 11 మున్సిపాలిటీ ల్లో వివిధ కారణాలతో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
కోర్టు కేసులు, సాంకేతిక కారణాలు, సభ్యుల రాజీనామాలు, మరణాలు వంటి పరిణామాల వల్ల ఈ పరిస్థితి తొర్రూర్, జనగామ, క్యాతనపల్లి, ఖానాపూర్, ఇంద్రేశం, కాగజ్‌నగర్, జహీరాబాద్, ఇబ్రహీంపట్నం పురపాలికల్లో ఏర్పడింది. అయితే ఈ వాయి దా ఎన్నికలు అన్ని పార్టీలకు వ్యూహాత్మకంగా కీలకంగా మారాయి. బీఆర్ ఎస్ ఇప్పటికే ఈ మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
స్థానిక నాయకత్వాన్ని చురుకుగా మార్చడం, అసంతృప్త నాయకులను సమీకరించడం, ఇతర పార్టీలలోని అసంతృప్తుల ను తమవైపు తిప్పుకోవడం వంటి చర్యలను పార్టీ ప్రారంభించింది. ఎన్నికలు జరిగే సమయానికి పూర్తి స్థాయి వ్యూహంతో బరిలోకి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇన్‌చార్జ్‌లు..
ప్రస్తుతం హంగ్ పరిస్థితులు నెలకొన్న మరో 8 మున్సిపాలిటీల్లో బీఆర్ ఎస్‌కు అనుకూల సమీకరణాలు కనిపిస్తున్నాయి. పూర్తి మెజారిటీ లేకపోయి నా, స్వతంత్ర సభ్యులు, చిన్న పార్టీల కౌన్సిలర్ల మద్దతుతో ఈ మున్సిపాలిటీలను కూడా తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇప్పటికే స్వతంత్ర కౌన్సి లర్లతో చర్చలు ప్రారంభమయ్యాయి.
స్థానికంగా ఉన్న వ్యక్తిగత సంబంధాలు, గతంలో కలిసి పనిచేసిన అను భవం వంటి అంశాలు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారుతున్నాయి. ఈ 8 మున్సిపాలిటీలను కూడా దక్కించుకుంటే మొత్తం సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మున్సిపల్ పీఠాలను దక్కించుకునే లక్ష్యంతో బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే 8 కీలక మున్సిపాలిటీలకు ప్రత్యేక ఇన్‌చార్జ్‌లను నియమించింది.
సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులైన నేతలను ఈ బాధ్యతలకు ఎంపిక చేసింది. అవసరమైతే స్వతంత్రులను పార్టీలోకి ఆహ్వానించడం, రాజకీయంగా ఒప్పించడం వంటి చర్యలను కూడా చేపడుతున్నారు. ఈ చర్యలతో హంగ్ మున్సిపాలిటీలను కూడా గెలుచుకునే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోంది.
కేటీఆర్ దిశానిర్దేశం..
మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు, కుట్రల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. నేడు ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇన్-చార్జ్‌లను నియమించారు. ఈ మేరకు ఆయన ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్-చార్జ్‌లతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు.
స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమ కిడ్నాప్‌లు, బెదిరింపులు, పోలీసుల దుర్వినియోగం వంటి అంశాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్, పార్టీ స్థానిక నాయకత్వానికి అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అరాచకాల నేపథ్యంలో స్థానిక నాయకత్వానికి అన్ని విధాలా మద్దతుగా నిలబడేందుకు, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్-చార్జ్‌లుగా పంపుతున్నట్లు ప్రకటించారు.
ఆయన ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వెంటనే తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు. ఎన్నికలు జరగనున్న 8 మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ స్పష్టంగా చైర్మన్ పీఠాలను గెలుచుకునే అవకాశం ఉన్నందున, ఈ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఈ ఎనిమిది మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు చేసినా తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేరని పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఆయా మున్సిపాలిటీల ఇన్‌చార్జ్‌ల వివరాలు
1.తొర్రూర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
2.జనగామ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
3. క్యాతనపల్లి ఎమ్మెల్యే కోవ లక్ష్మి
4. ఖానాపూర్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్
5. ఇంద్రేశం ప్రభాకర్‌రెడ్డి, యాదవరెడ్డి
6. కాగజ్‌నగర్ మాజీమంత్రి జోగు రామన్న
7. జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతాలక్ష్మారెడ్డి
8. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు