29-06-2025 12:00:00 AM
కోల్‌కతాలో మళ్లీ దారుణం జరిగింది. దక్షిణ కోల్‌కతాలోని ఓ కాలేజీలో న్యాయశాస్త్రం చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ జరిగింది. జాన్ 25న సాయంత్రం 7.30 ప్రాంతంలో కాలేజీ భవన సముదాయం సెక్యూరిటీ గార్డ్ రూంలో జరిగిన ఘటనపై ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుర్మార్గమైన ఆ ఘటనలో ఒక పూర్వవిద్యార్థి, ఇద్దరు ప్రస్తుతం అదే లా కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు.
ఒకడు బలవంతం చేస్తుండగా, ఇద్దరు మొబైల్‌లో రికార్డు చేశారు. రాత్రి 10.30 ప్రాంతంలో ఆ విద్యార్థిని విడిచి పెట్టి, పోలీసులకు ఫిర్యాదు చేస్తే, తమ మొబైల్‌లో వున్న వీడియోను సోషల్ మీడియాలో పెడతామని నిందితులు బెదిరించారని ఆ విద్యార్థిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ ముగ్గురు నిందితుల్లో పూర్వ విద్యార్థి చాలా పలుకుబడి గలవాడు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
తృణమూల్ కాంగ్రెస్‌తో అతనికి సంబంధాలు ఉన్నాయని వామపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. జరిగిన దారుణ ఘటనపై విద్యార్థులు కోల్‌కతాలో నిరసన ప్రదర్శన జరిపారు. పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. ఆ విద్యార్థిని శరీరంపై గోళ్లతో చేసిన గాయాలు ఉన్నాయని నిర్ధారించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఒకడు 24 ఏళ్ల ఆ విద్యార్థిణిని పెళ్లి చేసుకోవాలని అడిగాడు.
అందుకు ఆమె నిరాకరించింది. పలుకుబడి గల ఆ పూర్వవిద్యార్థి గతంలో విద్యార్థి నాయకుడు. ఇప్పుడు ఆ మొదటి ఏడాది విద్యార్థిని కాలేజీలో విద్యార్థి సంఘానికి కార్యదర్శిని చేశాడు. హాకీ స్టిక్స్‌తో కొడుతూ తన మీదికి వచ్చిన అతణ్ణి ప్రతిఘటించినా ప్రయోజనం లేకపోయిందని, కాళ్లావేళ్లా పడ్డా వినలేదని ఆ విద్యార్థిని వాపోయింది.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం, రేప్ చేసింది ఒకడే అయినా, అందుకు సహకరించిన వారు కూడా అంతే నేరం చేసినట్టవుతుంది. కనుక, పోలీసులు దీనిని గ్యాంగ్ రేప్ కింద పరిగణించి కేసు నమోదు చేశారు.
ఈ ఘాతుకం గత ఏడాది కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్‌ను కాలేజీ భవనంలోనే రేప్ చేసి ప్రాణాలు తీసిన ఘటనను గుర్తుకు తెచ్చింది. గత ఏడాది ఆగస్టు 8న జరిగిన ఈ దారుణ ఘటన దేశాన్ని కుదిపేసింది. దేశ వ్యాప్తంగా డాక్టర్లు సమ్మె చేశారు. సుదీర్ఘంగా సాగిన ఈ కేసు దర్యాప్తులో, నేరం చేసిన ఆ వర్కరు సంజయ్‌రాయ్ ఎంత క్రూరుడో బయటపడింది.
వాడొక కామాంధుడని తేలింది. సంజయ్‌రాయ్ క్రూరత్వం అప్పుడు దేశ ప్రజలను వణికించింది. మహిళలు తమ కామదాహం తీర్చే సాధనాలని సంజయ్ రాయ్ భావించాడు. తాజాగా కోల్‌కతా గ్యాంగ్ రేప్ కేసులో, లా విద్యార్థిని తాము చెప్పినట్లు వినాల్సిందేనన్న పురుష అహంకార ధోరణి ప్రస్ఫుటమైంది. దేశంలో ఇప్పుడు జరుగుతున్న నేరాల్లో రేప్ అనేది ఇంకా సర్వసాధారణ నేరంగా కనిపించడం సిగ్గుచేటు.
ఇలాంటి నేరాలు చాలావరకు నమోదు కావు. నమోదవుతున్న కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడతుండటం, ఈ విషయంలో వస్తున్న సామాజిక చైతన్యం పరిస్థితుల్లో మార్పు తెస్తున్నది. ఇలాంటి ఘటనలపై వెల్లువెత్తుతున్న నిరసనలతో ప్రభుత్వాలు సత్వరం కఠిన చర్యలు తీసుకుంటుండటం కూడా ఈ మార్పుకు దోహదపడుతోంది.