15-11-2025 03:20:27 PM
ఇండియన్ పికిల్ బాల్ నేషనల్స్-2025లో అద్భుత ప్రతిభ చాటిన ఆశ్రిత రాజు దాట్ల
పటాన్ చెరు: భారతీయ పికిల్ బాల్ జాతీయ పోటీ-2025లో 18 ఏళ్లలోపు బాలికల రాష్ట్ర జట్టు ఈవెంట్ లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని బీ.ఆర్క్ తొలి ఏడాది విద్యార్థిని ఆశ్రిత రాజు దాట్ల అద్భుత ప్రతిభ కనబరచి బంగారు పతకాన్ని గెలుపొందింది. ఈ ప్రతిష్టాత్మక జాతీయ టోర్నమెంటును భారతీయ పికిల్ బాల్ అసోసియేషన్ బెంగళూరులో ఈనెల 13 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తోంది. కర్ణాటక పికిల్ బాల్, ప్రియా ఉత్పత్తి-సబాలా (మిల్లెట్లతో తయారీ), ఇండియన్ పికిల్ బాల్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్ షిప్, దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి యువ ప్రతిభను ఒకచోట చేర్చింది.
ఈ పోటీలో అసాధారణ నైపుణ్యం, క్రీడా స్ఫూర్తి, అంకితభావాన్ని ప్రదర్శించిన ఆశ్రితకు డైరెక్టర్ ప్రవృత్ బి.హెచ్., చీఫ్ రిఫరీ కునాన్ పోఖామా సంతకాలతో కూడిన ప్రశంసా పత్రంతో పాటు బంగారు పతకాన్ని ఇచ్చి సత్కరించారు. ఆశ్రిత సాధించిన అత్యుత్తమ విజయానికి గీతం సీనియర్ నాయకత్వం అభినందనలు తెలిపింది. గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, క్రీడల విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎం.నారాయణరావు చౌదరి తదితరులు జాతీయ వేదికపై గీతం తరఫున అద్భుతంగా ప్రాతినిధ్యం వహించి, విశ్వవిద్యాలయానికి గర్వకారణంగా నిలిచినందుకు ఆమెను ప్రశంసించారు. క్రీడా రంగంలో ఆమె నిరంతరం రాణించాలని వారు అభిలషించారు.