15-11-2025 03:53:22 PM
ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పంట మార్పిడి ద్వారా భూములు సారవంతంగా మారుతాయి అని, సేంద్రియ ఎరులకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శనివారం సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 72వ అఖిల భారత సహకార సంఘం వారోత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు హాజరయ్యారు.
జిల్లా ఉద్యాన, వ్యవసాయ, జిల్లా సహకార, ఫ్యాక్స్ తిరుమల ఆయిల్ కెం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగుపై ఎమ్మెల్యే రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ముందుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... రైతులు వరితో పాటు ఆరుతడి పంటలకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఆరుతడి పంటల ద్వారా అధిక లాభాలు అర్జించవచ్చునని పేర్కొన్నారు. నిత్యం వరి వేయడం ద్వారా భూమిలో ఉన్న సారవంతం పూర్తిగా పోయి భూములు సౌడు భూములుగా మారుతున్నాయని అన్నారు.
సేంద్రియ ఎరువుల ద్వారా భూములు సారవంతంగా మారే అవకాశాలు ఉన్నాయని, అధిక యూరియా వాడడం ద్వారా దిగుబడులు సైతం తగ్గుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు ఉన్న భూములలో కొంత భాగం ఇతర పంటలకు మార్చుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారులు శాస్త్రజ్ఞుల సూచనల మేరకు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఖర్చు తక్కువగా ఉండి ఆదాయం ఎక్కువగా వస్తుందని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో 35 సంవత్సరాలు లాభాలు అర్జించవచ్చునని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలను ఉచితంగా అందిస్తుందని 90 శాతం సబ్సిడీపై డిప్ ఇరిగేషన్ అందిస్తుందని పేర్కొన్నారు.
చీడ పీడల బెడద ఉండదని తుఫాను లాంటి వాడిని సైతం తట్టుకుంటుందని, మొదటి మూడు సంవత్సరాలు అంతర్ పంటలు వేసుకోవచ్చు అని సూచించారు. అలాగే రైతులందరూ వాతావరణానికి అనుగుణంగా అనురాధ కార్తిలోనే నార్లు పోయాలని రైతులను కోరారు. అలుకుడు ద్వారా దిగుబడి ఎక్కువ వస్తుందని సూచించారు. అతి పెద్ద భారతదేశంలో 150 కోట్ల రైతంగం ఉన్నప్పటికీ ఫామ్ ఆయిల్ ను పక్క దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నయని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ ద్వారా రైతులకు ఒక్క ఎకరాకు ఒక లక్ష రూపాయల ఆదాయం చేపడుతుందని పేర్కొన్నారు.
రైతులు నానో యూరియాను వినియోగించాలని దీని ద్వారా సత్ఫలితాలు ఉన్నాయని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గం లో 60 వేల కోట్ల రూపాయల రైతు బోనస్ ను అందించామని ప్రస్తుత సీజన్ లో అది 100 వేలకోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో పాలించిన పాలకులు, రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ప్రస్తుతం రైతుల వద్దకు వచ్చి కపట ప్రేమ మొసలి కన్నీరు కారుస్తున్నారని అలాంటి వారిని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. జిల్లా ఉద్యాన శాఖ, తిరుమల ఆయిల్ కం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ పై అవగాహన నిర్వహించారు.