15-11-2025 04:27:53 PM
ధనుంజయ నాయుడు..
మోతే (విజయక్రాంతి): డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో జరిగే సీపీఐ శత వార్షికోత్సవ బహిరంగ సభను జయప్రదం చేసేందుకు శ్రేణులు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలుపునిచ్చారు. శనివారం మోతేలో పాత్రికేయులతో మాట్లాడుతూ... భారత పార్లమెంటు చరిత్రలో 100 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన ఏకైక పార్టీ సీపీఐ పార్టీ అని, భారతదేశంలో జరిగిన అన్ని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ఏకైక పార్టీ సీపీఐ అని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వ వహించి పది లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసిన మహోన్నత చరిత్ర సీపీఐ పార్టీది అన్నారు.
బ్రిటిష్ కాలం నుంచి ఈనాటి వరకు కార్మికుల రక్షణ కోసం అనేక పోరాటాలు చేసి చట్టాలు సాధించి కార్మికులకు అండగా ఉన్న ఏఐటియుసి కి మాతృ సంస్థ కూడా సిపిఐ అని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల కొరకు ఏఐఎస్ఎఫ్ యువజనలు కొరకు ఏఐవైఎఫ్ కార్మికుల కొరకు ఏఐటీయూసీ మహిళల కొరకు మహిళా సమాఖ్య గీత పనివారల సంఘం బీసీ హక్కుల సాధన సమితి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం లాంటి అనేక సంఘాలు నిర్మించి శాఖోప శాఖలుగా దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ఉన్న ఏకైక వామపక్ష పార్టీ సిపిఐ అని అన్నారు.
ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని ధ్వంసం చేసేందుకు మూడు నల్ల చట్టాలు తెస్తే దేశవ్యాప్తంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఉద్యమించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నల్ల చట్టాలు ఉపసంహరించుకునేలా ఉద్యమించింది కమ్యూనిస్టు పార్టీ అని ఆయన గుర్తు చేశారు. డిసెంబర్ 26వ తేదీ వరకు గ్రామ గ్రామాన కరపత్రాల ద్వారా కళారూపాల ద్వారా ప్రచారం చేసి ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని కమ్యూనిస్టు పార్టీ అభిమానులు, వామపక్ష అభిమానులు అభ్యుదయ వాదులు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.