మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు
గట్టు, జూన్ 22: మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పి. మంజుల మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు జ్ఞాపకశక్తి తగ్గి వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయని తెలిపారు.
ఏఎస్‌ఐ అయ్యన్న మాట్లాడుతూ మాదకద్రవ్యాల వ్యసనం వల్ల మానసిక, శారీరక సమస్యలు ఏర్పడతాయని, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె.ఎస్.డి. రాజు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూన్ 26ను మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంగా పాటిస్తుందని వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






