03-05-2025 01:10:04 AM
ప్రజల నీటి గోస తీర్చేందుకు కేసీఆర్ తపనపడ్డారు
సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశ్‌పాడే రచించిన పుస్తకాల ఆవిష్కరణ సభలో హరీశ్‌రావు
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): కృష్ణా జలాలను దోపిడీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఇప్పుడు గోదావరి నీళ్లను దోచుకునే కుట్రకు తెరలేపారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఈ కుట్రలను ఆపే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
జలహారతి పేరిట కార్పొరేషన్ పెట్టిన ఏపీ ప్రభుత్వం డీపీఆర్‌లను సిద్ధం చేసి, టెండర్లను పిలుస్తోందని ఆరోపించారు. తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశ్ పాండే రచించిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు: ప్రశ్నలు ‘సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానం’ పుస్తకాలను తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీలో హరీశ్‌రావు, మాజీ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టు కూడా రాలేదని విమర్శించారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లకు లిఫ్ట్ పెట్టాలని అవివేకంగా మాట్లాడుతున్నారని, తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు లిఫ్ట్‌తోనే తప్ప, గ్రావిటీతో నీళ్లు రావన్నారు. కాళేశ్వరం కూలిందని దుష్ర్పచారం చేస్తూనే మల్లన్నసాగర్ నుంచి తాగునీటిని హైదరాబాద్‌కు తరలించేందుకు టెండర్లను పిలిచింది రేవంత్ సర్కార్ అని ఎద్దేవా చేశారు.
మూసిని శుద్ధి చేయడానికి తెచ్చే నీళ్లు మల్లన్నసాగర్‌వేనని హరీశ్‌రావు చెప్పారు. కేసీఆర్ దూరదృష్టితో మల్లన్న సాగర్ నిర్మించారు కాబట్టే ఈరోజు 20 టీఎంసీల నీటిని హైదరాబాద్‌కు వస్తున్నాయన్నారు. ఎక్కడైనా బరేజ్ రెండు, మూడు టీఎంసీలకు మించి ఉండదని ఉత్తమ్ అంటున్నారని, గంగా నదిపై ఫరక్కా బరాజ్ 30 టీఎంసీల సామర్థ్యంతో ఉందని, దాని డెడ్ స్టోరేజీ 7టీఎంసీలు ఉందని హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు.