22-07-2024 11:20:34 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించామని తెలిపారు. సూపర్‌సిక్స్ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించామని వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం, సామాజిక భద్రత పెన్షన్లను రూ.4వేలకు పెంచామని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలని గవర్నర్ కోరారు.
వైసీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అశాస్త్రీయంగా జరిగిన విభజనతో ఏపీకి నష్టం జరిగిందన్నారు. విభజనతో రెవెన్యూలోటు కారణంగా రాష్ట్రం ఒడిదుడుకులు ఎదుర్కుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పిన గవర్నర్ 2014-19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయన్నారు. 2014-19 మధ్య భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగిందని స్పష్టం చేశారు. పోలవరాన్ని 75 శాతానికి పైగా పూర్తి చేశామని, అభివృద్ధి దిశగా పరుగు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగిందని గవర్నర్ వెల్లడించారు.