calender_icon.png 31 October, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ విలవిల

30-10-2025 01:32:52 AM

వణికించిన ‘మొంథా’ తుఫాన్

-తీరప్రాంత జిల్లాల్లో కుంభవృష్టి.. స్తంభించిన జనజీవనం 

-రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందిపై ప్రభావం

-రెండు మరణాలు నమోదు 

-సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

-ముంపు బాధితులకు ఆర్థికసాయం ప్రకటన

అమరావతి, అక్టోబర్ 29: మొంథా తుఫాన్ తాకడికి ఆంధ్రప్రదేశ్ విలవిలలాడింది. తీర ప్రాంత జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. మంగళవారం సాయంత్రం మొదలైన ఏకధాటిగా కురుస్తూనే ఉంది. బుధవారం ఉదయానికి తీవ్రత మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 249 మండలాలు, 48 మున్సిపాలిటీల పరిధిలోని 18 లక్షల మంది ప్రభావితమయ్యారు. బలమైన ఈదురు గాలులకు పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రెండు మరణాలు నమోదయ్యాయి. భారీ వర్షాల కారణంగా కోనసీమ జిల్లావ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. 300 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముంపు ప్రాంత వాసులు 400 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

ఒంగోలు పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుని జనజీవనం స్తంభించింది. రాకపోకలు నిలిచిపోయాయి.  బాపట్ల జిల్లా పర్చూరులో ప్రార్థనా మందిరం చుట్టూ వరద చుట్టుముట్టి 20 మంది చిక్కుకున్నారు. వారిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి రహదారిపై పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల అటవీశాఖ చెక్ పోస్ట్ నుంచి వాహన రాకపోకలు బంద్ అయ్యాయి. ఇదే జిల్లాలోని కొత్తూరు సమీపంలోని వెలిగొండ ప్రాజెక్ట్ సొరంగాల్లోకి వరద చేరింది. దీంతో సొరంగంలో లైనింగ్ పనులు చేస్తున్న 200 మంది కార్మికులు వరదలో చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది వారిని సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చింది.

వర్షాల కారణంగా అనకాపల్లి జిల్లా  శారదా నది ఉగ్రరూపం దాల్చింది. తాచేరు, పెద్దేరు, బొడ్డేరు కలయికతో నీటి ప్రవాహం పెరగడంతో గట్టు పెద్దఎత్తున కోతకు గురైంది. ఏజెన్సీలో భారీ వర్షాలకు నంద్యాల జిల్లాలోని చామకాల్వ, మద్దిలేరువాగు, కుందూ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సాయంత్రానికి తుఫాన్ వాయుగుండంగా బలహీనపడి గంటకు 12 కి.మీ వేగంతో కదిలింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం కొనసాగింది. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మం జిల్లాకు 110 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. దీంతో వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆకస్మిక హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ వ్యూ అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం పర్యటించారు. 

కూలిన బ్రహ్మంగారి మఠం మిద్దె

వరుసగా కురుస్తు న్న వర్షాలకు కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో కాలజ్ఞాని పోతు లూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన మ ట్టి మిద్దె కూలింది. ఈ మిద్దె సుమారు 350 ఏళ్ల క్రితం నాటిదని, మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల తాజాగా ప్రహారీతో పాటు పైకప్పు కూలిందని స్థానికులు తెలిపారు. కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో ముప్పు తప్పింది.