30-10-2025 01:27:13 AM
 
							-కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
-నివురుగప్పిన నిప్పులా సీఎం, డిప్యూటీ సీఎంమధ్య విభేదాలు
-మరోసారి తెరమీదకు ‘50/50’ ఫార్ములా
-నవంబర్‌తో సిద్ధరామయ్య పాలనకు రెండున్నరేళ్లు
-ఢిల్లీ పెద్దలతో భేటీఅయ్యేందుకు డీకే ప్రయత్నాలు
-విభేదాలతో పార్టీ దెబ్బతింటుందని కేడర్ ఆందోళన
బెంగళూరు, అక్టోబర్ 29: కర్ణాటక.. భారతదేశంలోనే మూడో సంపన్న రాష్ట్రం. 139 ఏళ్ల నుంచి దేశ రాజకీయాల క్రియాశీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పాలిస్తున్న మూడు రాష్ట్రాల్లో ఒకటి. పార్టీకి ఇది కలికితురాయి.. కానీ, రాష్ట్రంలో కొన్నాళ్ల నుంచి పార్టీ ప్రభ మసకబారుతున్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య రాజుకున్న ఆధిపత్య పోరు ఆ పార్టీని అస్థిరపరిచేలా ఉంది. ఏడు నెలల నుంచి సాగుతున్న ఈ వ్యవహారం ఇకపై రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తును, నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఎవరికివారు ప్రయత్నాలు చేస్తుండటం పార్టీ వర్గాలు, కేడర్‌కు తలనొప్పిగా మారింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 224 నియోజకవర్గాల్లో 135 స్థానాల్లో గెలుపొంది, స్పష్టమైన మెజార్టీ సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. ‘50/50 ఫార్ములా’ ప్రకారం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు. ఫార్ములా ప్రకారం నవంబర్‌తో సిద్ధరామయ్య గడువు ముగియనుంది. దీంతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే కొనసాగుతారా? లేదంటే డీకే శివకుమార్ ఆ పీఠాన్ని దక్కించుకుంటారా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో డీకే శిమకుమార్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
ఒకవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీ పెద్దలను కలిసే పనిలో బిజీగా ఉండగా, మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నవంబర్ 18 నాటికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకర వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఒక్కరే కొనసాగుతుండగా, పార్టీలో ఆయన ప్రాభవాన్ని తగ్గించే ఎత్తుగడలో భాగంగా సిద్ధరామయ్య లింగాయత్ సామాజికవర్గానికి చెందిన న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్, ఎస్సీ నేత, హోంమంత్రి జీ పరమేశ్వర, మరో మంత్రి సతీశ్ జార్కిహోళిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే సిద్ధరామయ్యకు సన్నిహితుడు, విధేయుడైన మంత్రి సతీశ్ జార్కిహోళీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నా యనే పుకార్లు సైతం వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇదే విషయాన్ని తాజాగా హోంమంత్రి పరమేశ్వర సైతం ఓ సభలో బాహాటంగా వ్యక్తపరిచారు. ఏదేమైనా సిద్ధరామయ్య మాత్రం ముఖ్యమంత్రి పదవిని వదులుకునే పరిస్థితి లేదనేలా ఆయన వైఖరి కనిపిస్తున్నది. అంతేకాకుండా.. తన రాజకీయ వారుసులు కుమారుడు యతీంద్ర, మంత్రి సతీశ్ జార్కిహోళీ అని ప్రకటించడం పార్టీలో అగ్గి రాజేసెలా చేసింది.
బీజేపీ విమర్శనాస్త్రాలు
కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుంటే, మరోవైపు కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నానాటికీ పతనమవుతుంటే, ప్రభుత్వ పెద్దలు మాత్రం కుల, మత రాజకీయాలపై దృష్టి సారించారని ఆరోపించారు. రాష్ట్రఆర్థిక లోటు (ఫిస్కల్ డెఫిసిట్) సుమారు 25 శాతానికి చేరుకుందని, ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన రూ.14,000 కోట్లకు పైగా నిధులు దారి మళ్లాయని, కొందరు ప్రభుత్వ పెద్దలు వాటిని దుర్వినియోగం చేశారని కూడా ఆరోపిస్తున్నారు.
విమర్శలను తిప్పికొడుతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ నేతలు, పార్టీకి అనుకూలమైన రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ప్రజలు 135 స్థానాల్లో గెలిపించారని, ప్రజల విశ్వసనీయతకు అదే గీటురాయి అని తేల్చిచెప్తున్నారు. ఇప్పటికీ కర్ణాటక యావత్ దేశానికి ఐటీ హబ్‌గా ఉందని, పన్ను చెల్లింపుల్లో దేశంలోనే రెండోస్థానంలో ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తక్కువ చేసి చెప్పడం అవివేకమంటని విమర్శలను తిప్పికొడుతున్నారు. దేశ జీడీపీలో కర్ణాటక రెండో అతిపెద్ద భాగస్వామి అని, జాతీయ సగటు వృద్ధిలో రాష్ట్రం 6.2శాతం నమోదు చేసిందని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగ వృద్ధి 4శాతం పెరిగిందని వెల్లడిస్తున్నారు.
అలాగే, ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యతిరేకంగా వచ్చిన అవినీతి ఆరోపణలను సైతం వారు ఖండిస్తున్నారు. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో న్యాయస్థానం ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేస్తున్నారు. అయినప్పటికీ, కాంగ్రెస్ అంతర్గత విభేదాలు కర్ణాటక అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని కొందరు మీడియా ప్రతినిధులు, విమర్శకులు వాదిస్తున్నారు. రాష్ట్ర జీడీపీ 14.3 శాతం నుంచి 13.1 శాతానికి తగ్గిందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గాయని, నిరుద్యోగం పెరిగిందని చెప్తున్నారు. ప్రభుత్వంపై వచ్చిన వాల్మీకి కుంభకోణం ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్‌కు ఆయుధాలు మారాయంటున్నారు.
తర్వాతేంటి?
కర్ణాటకలో పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న సందర్భంలో సీఎం సిద్ధరామయ్య తన పదవీకాలాన్ని పూర్తి చేస్తారా? లేదా తన వారసుడు సీఎంని చేస్తారా? అనే అంశం తేలాల్సి ఉన్నది. ఈ అంశంపై పార్టీ హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది? పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారనే అంశంపై ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇది ఒకవైపు అయితే.. మరోవైపు పార్టీలో డీకే శివకుమార్ ప్రాతినిధ్యం తగ్గితే, ఆయన సామాజికవర్గమైన ‘వొక్కలింగ’ ప్రజల మద్దతు పార్టీ తగ్గుతుందనే, తద్వారా పార్టీ విశ్వసనీయత దెబ్బతింటుందనే ఆందోళనలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అలాగే ‘ఇండియ కూటమి’లో భాగస్వాములైన టీఎంసీ, ఆర్జేడీ కర్ణాటకలో పార్టీ లుక లుకలను ప్రశ్నించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ విఫలమయ్యారని, దీంతో రాష్ట్రంలో పార్టీ నాయకత్వం ప్రశ్నార్థకమవుతుందనే వివర్శలు వెల్లువెత్తుతున్నాయి.