calender_icon.png 17 November, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపెన్ కాస్ట్ లో పరిహారం కాజేసేందుకు కుట్ర

17-11-2025 06:12:34 PM

- ఏళ్లుగా సాగులో ఉన్న వారికి అన్యాయం..

- సమగ్ర విచారణ చేసి పరిహారం ఇవ్వాలి..

- కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ కాసిపేట, దుబ్బగూడెం భూ బాధితులు..

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దుబ్బగూడెంలో గల కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ లో పరిహారం కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని, ఏళ్లుగా సాగులో ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారని కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ కాసిపేట, దుబ్బగూడెం భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ కాసిపేట, దుబ్బగూడెం భూ బాధితులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. కాసిపేట మండలంలోని దుబ్బగూడెం ఓపెన్ కాస్ట్ లో భూమి సాగు చేసుకున్నది మేమైతే, పరిహారం మాత్రం భూమికి సంబంధం లేని వారికి, అక్రమార్కులకు ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాసిపేట మండలంలోని దుబ్బగూడెం శివారులోని 146 సర్వే నెంబర్ లోని 67 ఎకరాల భూములు మావి ఎన్నో ఏళ్లుగా సాగు చేశామని, కాని పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ దొంగలకు పరిహారం ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. సర్వే నెంబర్ 144లో భూములకు సంబందించి పరిహారం విషయంలో రూ.1.30 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారన్నారు. ఓసీలో దుబ్బగూడెం గ్రామస్తులు కాకుండా  దొంగతనంగా పరిహారం కోసం గ్రామంలోకి వచ్చిన దొంగలకు పరిహారం ఇచ్చారన్నారు. 70 ఏళ్ల నుంచి 67 ఎకరాల్లో సాగు చేసుకున్న 25 మంది రైతులకు నష్టం చేస్తున్నారన్నారు.

మాకు న్యాయం చేసే వరకు ఓపెన్ కాస్ట్ ను అడ్డుకుంటామని, ఓసీకి గ్రామాన్ని తీయనీయమన్నారు. ఇటీవల వచ్చిన వారు ఎస్టీల పేరుతో పరిహారం కొట్టేద్దామని చూస్తున్నారని, వెంటనే అధికారులు వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాగులో ఉన్న బీసీ లు, ఎస్సీలకు ఇవ్వమని, కాని భూముల్లో లేని ఎస్టీలకు ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇదే ఓసీలో గతంలో బీసీలు, ఎస్సీలకు పరిహారం ఇచ్చిన అధికారులు, ఇప్పుడు మాత్రం ఎస్టీలకు ఇస్తామని చెప్పి 70 ఏళ్లుగా సాగులో ఉన్న మాకు కాకుండా కొత్తగా కొంతమంది పరిహారం కాజేసేందుకు వచ్చిన వారి పేర్లు పెట్టి పరిహారం కొట్టేద్దామని చూస్తున్నారన్నారు. కేకే ఓసీ భూముల నష్టపరిహారంలో భారీ అవకతవకలు జరిగాయన్నారు.

దుబ్బగూడెం గ్రామ ప్రజల పూర్వీకుల నుండి సాగుచేసుకుంటూ వస్తున్న వ్యవసాయ భూములు కేకే ఓసీ ప్రాజెక్టు కారణంగా స్వాధీనం కానున్న నేపథ్యంలో నష్టపరిహారం ప్రక్రియలో తీవ్ర అక్రమాలు, అన్యాయాలు చోటుచేసుకున్నాయన్నారు. మా ఇళ్లకు సంబంధించిన నష్ట పరిహారం, ఫ్లాట్లు మాకు లభించినప్పటికీ, మా ఇళ్ల వెనక ఉన్న వ్యవసాయ భూములకు వచ్చిన రూ.1.30 కోట్ల నష్ట పరిహారం గ్రామ ప్రజలకు ఏ రూపంలోనూ చెల్లించబడలేదన్నారు. ఈ డబ్బులు కొందరు బ్రోకర్లు, ప్రభావశీలుల చేతుల్లో మాయమైపోయయన్నారు. ఈ విషయం పై గ్రామ ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, రెవెన్యూ అధికారులు, సింగరేణి అధికారులు మూడు సార్లు సర్వే చేసినా కూడా ఈ సమస్యకు ఎటువంటి న్యాయమైన పరిష్కారం చూపలేదన్నారు. ఇప్పుడు అయితే అధికారులు కేవలం ఎస్టీలకు మాత్రమే పరిహారం ఇస్తామంటూ కొత్త గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్నారు.

ఇది గ్రామంలో నివసిస్తున్న ప్రతి వర్గానికి పూర్తిగా అన్యాయమని, భూములపై నష్టపరిహారం తీసుకున్న వారి వివరాలను పూర్తిగా విచారణ చేసి ప్రజలకు వెల్లడించాలన్నారు. నిజంగా ఇక్కడ పుట్టి పెరిగినవారి కుటుంబ చరిత్ర, నివాసం, పూర్వీకుల భూస్వామ్య వివరాలపై విస్తృత విచారణ చేయాలన్నారు. అవకతవకలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఎవరికి కూడా నష్ట పరిహారం విడుదల చేయరాదన్నారు. సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంబంధిత శాఖలను వేడుకుంటున్నామని, మాకు న్యాయం జరగకుంటే ఆందోళనలు, నిరాహార దీక్షలు సహా ఏదైనా పెద్ద స్థాయి పోరాటానికి సిద్ధమని దుబ్బగూడెం గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి కూడా నేరుగా తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బగూడం, కాసిపేట ఓపెన్ కాస్ట్ భూ బాధితులు బిజ్జూరి రాయలింగు, కందికట్ల చంద్రకళ, గోనెల శ్రీనివాస్, రత్నం రామస్వామి, రామటంకి రాజేందర్ గోనె లచ్చయ్య, కలాలి బాల శంకర్, లక్ష్మీ, నగురారపు సుమన్, పోశం, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.