calender_icon.png 17 November, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో నిర్ధారిత వరి కొనుగోలు కేంద్రాలు అన్ని వెంటనే ప్రారంభించాలి

17-11-2025 06:54:34 PM

వరి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ చేయాలి

వడ్లు రవాణా చేసే అన్ని వాహనాలను జియో ట్యాగింగ్ చేయాలి

కొనుగోలు కేంద్రాల్లో ప్యాడి క్లీనర్ లు తప్పనిసరిగా వాడాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలో నిర్ధారించిన వరి కొనుగోలు కేంద్రాలను అన్నింటిని వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్ లో వరి కొనుగోలుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పానగల్ మండలంలో కోతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఐకెపి, సహకార సంఘం వారు సమన్వయం చేసుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో వరి కోగోలు వేగం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యం, రైతు వివరాలను వెంటనే ఆన్లైన్ లో డేటా ఎంట్రీ చేసి రైతుకు సత్వరమే డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి, ఆన్లైన్ లో చేసిన డేటా ఎంట్రీ కి పొంతన లేదని, డేటా ఎంట్రీ అంత ఆలస్యం ఎందుకు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రైతు  నుండి వడ్లు తూకం చేసుకొని మిల్లుకు పంపిన వెంటనే రైతుకు డబ్బులు పడే విధంగా వెంట పడాలని ఇదే ప్రధాన బాధ్యత అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 291 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 13,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, అందులో 10,682 మెట్రిక్ టన్నులు మిల్లులకు తరలించి 6000 మెట్రిక్ టన్నులకు మాత్రమే ఆన్లైన్  ఎంట్రీ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పటి వరకు 876 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి  రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. రైతులకు డబ్బులు పడే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో నిబంధనల ప్రకారమే కొనుగోలు చేయాలని, ప్యాడి క్లీనర్లు తప్పనిసరిగా వాడే విధంగా చూడాలన్నారు. నాణ్యమైన వడ్లు ఇస్తే మిల్లర్లు ఒక్క గ్రాము కూడా తరుగు తీయకుండా బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.

వడ్లు తరలించే అన్ని వాహనాలకు జియో ట్యాగింగ్ చేయాలని, సేకరించిన వడ్లు ఉంటే కేటాయించిన  మిల్లులో ఉండాలి లేదంటే గోదాములో ఉండాలి తప్ప పక్కదారి పట్టడానికి వీలు లేదన్నారు. మిల్లర్ల నుండి బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని, బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లర్లు ప్రైవేట్ మిల్లింగ్ సైతం చేసుకోడానికి వీలు లేదన్నారు.  బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లులను వెంటనే సీజ్ చేయాల్సిందిగా సివిల్ సప్లై అధికారిని ఆదేశించారు. వరి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అలసత్వం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్య నాయక్, జిల్లా సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం. జగన్మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, కోఆపరేటివ్ అధికారి ఇందిరా, ట్రాన్స్పోర్ట్ అధికారి మానస, మార్కెటింగ్ అధికారీ స్వరణ్ సింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.